న్యూఢిల్లీ: తనపై తమ పార్టీ పార్లమెంటు సభ్యులు ఇచ్చిన అనర్హత పిటిషన్ మీద వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు స్పందించారు రఘురామకృష్ణమ రాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు ఇటీవల స్పీకర్ ఓంబిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన విషంయ తెలిసిందే.

అనర్హత పిటిషన్ రాజ్యం వ్యతిరేకమని, తనపై వేసిన అనర్హత పిటిషన్ అనర్హం అయిపోతుందని ఆయన అన్నారు. కేంద్ర బలగాల ద్వారా తనకు భద్రత కల్పించాలని 20 రోజుల క్రితం కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కోరానని, ఆ విషయంపై మాట్లాడడానికే మళ్లీ హోం శాఖ కార్యదర్శిని కలిశానని ఆయన చెప్పారు. 

మామూలుగా ఎంపీలకు భద్రత కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుందని అంటూ రాష్ట్ర పోలీసు, రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తాయనే నమ్మకం పోయిందని ఆయన అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే తనపై కేసులు పెడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే కేంద్ర బలగాల భద్రత కోరినట్లు ఆయన తెలిపారు.

భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం జరగాల్సి ఉందని, అందుకే జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ కేందర్ బలగాల రక్షణ తనకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఒక ఎంపీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అది కల్పించనప్పుడు కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని రఘురామకృష్ణమ రాజు చెప్పారు.