ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు .. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారన్న విషయం తెలియగానే తాను షాక్ తిన్నానని.. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి తనకు 24గంటల సమయం పట్టిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.

కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ విషయంపై తాజాగా రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు.

మొదట రాహుల్- చంద్రబాబు భేటీ విషయం విని షాక్ తినప్పటికీ తర్వాత.. రాహుల్ నిర్ణయం తమకు శిరోధార్యమని భావించినట్లు చెప్పారు. ‘‘ అసలు రాహుల్‌ వద్దకు చంద్రబాబు ఎందుకు వెళ్లారంటే.. రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ పార్టీ అయినా పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే 40 లేదా 50 సీట్లు కూడా రావు. అలాంటప్పుడు ఏ పార్టీకి అధికారం రాదు. అందుకే కాంగ్రెస్ తో కలిశారని’’ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీలో పొత్తు విషయం పూర్తిగా రాహుల్ నిర్ణయానికే వదిలేసామని.. ఒంటరిగా పోటీ చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.