తనను చాలా మంది భయపెట్టాలని చూస్తున్నారని..  అయితే.. వారి బెదిరింపులకు తాను భయడనని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తనతో సన్నిహితంగా ఉన్న ఎంపీలను బెదిరించారని.. రాయలసీమలో కూర్చని ఖబడ్దార్ రఘురామ అంటున్నారని.. వాళ్లు అలా అన్నంత మాత్రాన తాను భయపడిపోనని ఆయన హెచ్చరించారు.

తనను వైసీపీ సమావేశానికి పిలవకపోవడంపై స్పీకర్ కి ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. సాయిబాబా ఆలయంలో విగ్రహం పడగొట్టడం విచారకరమని, దేవాలయాలపై దృష్టిపెట్టే మంత్రిని నియమిస్తే మేలని వ్యాఖ్యానించారు. ‘‘పాడి రైతులకు రాయలసీమలో అన్యాయం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. శివశక్తికి చెందిన వారి వివరాలు అడిగితే.. నేను ఇస్తాను. నా దిష్టిబొమ్మల దగ్దాన్ని మానుకోవాలన్నారు. రాయలసీమలో పశుగ్రాసం కొరత ఎక్కువ కాబట్టి.. నా బొమ్మలను కాల్చడానికి వాడే కంటే ...ఆ గడ్డిని పొదుపుగా వాడండి’’ అని రఘురామ అన్నారు. 

శివశక్తి పాలకేంద్రం తక్కువ ధరకే రైతుల దగ్గర పాలను కొంటోందని, శివశక్తి సంస్థ దోపిడీపై ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. రాయలసీమలో జరుగుతున్న దోపిడీని అరికట్టడంపై సీఎం దృష్టిపెట్టాలన్నారు. అమరావతి భూముల మీద సిట్‌ విచారణపై స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ఒక సామాజికవర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారన్న భావన ఉందన్నారు. తన చుట్టూ ఉన్న వ్యక్తులు చేస్తున్న చెడ్డపనులతో.. నిష్కల్మషమైన సీఎంకు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై దాడి సరికాదు, తగ్గించుకుంటే బాగుంటుందని హితవు పలికారు.