న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మీద పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నారని, తాను కూడా ఆ బాటలోనే నడుస్తున్నానని ఆయన అన్నారు.

ఏపీ ప్రభుత్వం కల్పించే భద్రతను నమ్ముకుంటే గొర్రె కసాయివాడిని నమ్మినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వమే తనకు రక్షమ కల్పించాలని ఆయన చెప్పారు. అధికార పార్టీలో ఉన్నా కూడా తనకు రక్షణ లేదని ఆయన అన్నారు. 

తనకు కేంద్ర ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. తన భద్రతపై రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు సమస్య రాష్ట్ర ప్రభుత్వంతోనే కాబట్టి ఆ ప్రభుత్వం భద్రత తనకు వద్దని ఆయన అన్నారు. 

రాజధాని ప్రాంత ప్రజల ఉసురు, శాపాలు తగలకుండా అమరావతిని కనీసం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానైనా ప్రకటిస్తే మంచిదని ఆయన అన్నారు గత కొంత కాలంగా రఘురామకృష్ణమ రాజు వైసిపి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున రఘురామకృష్ణమ రాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ పార్లమెంటు సభ్యులు లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు పిటిషన్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్ వల్ల తనపై ఏ విధమైన ప్రభావం పడదని రఘురామకృష్ణమ రాజు అన్నారు.