అమరావతి: తనను సీఐడి కస్టడీలో కొట్టారని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దానిపై కోర్టు వైద్య నిపుణులతో కమిటీ వేసి నివేదికలు కోరింది. ఆయన కోర్టుకు చేసిన ఫిర్యాదులోని అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. సిఐడి కస్టడీలో గుర్తు తెలియని వ్యక్తులు తనను దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. 

తన కాళ్లను తాళ్లతో కట్టేసి అరికాళ్లపై కర్రలు, ఫైబర్ లాఠీలతో కొట్టారని ఆయన ఆరోపించారు. గాయాలతో కమిలిపోయి ఉన్న తన అరిపాదాలను ఆయన న్యాయమూర్తికి చూపించారు. తనను అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టు ముందు హాజరు పరిచేంత వరకు చోటు చేసుకున్న పరిణామాలపై లిఖితవూర్వకమైన ఫిర్యాదు చేస్తానని రఘురామ చెప్పారు. అందుకు మెజిస్ట్రేట్ అరుణకుమారి అంగీకరించారు. దీంతో ఆయన నాలుగు పేజీల ఫిర్యాదును న్యాయమూర్తికి అందించారు.

Also Read: రఘురామ కృష్ణమ రాజుకు 18 రకాల వైద్య పరీక్షలు: ఆ తర్వాత రమేష్ ఆస్పత్రికి...

శుక్రవారం రాత్రి తాను నిద్రపోవడానికి సిద్ధపడుతుండగా ముఖాలకు కర్చీఫ్ లు కట్టుకున్న ఐదుగురు వ్యక్తులు వచ్చారని, తన రెండు కాళ్లను తాడుతో కట్టేశారని, ఒకతను తనను కర్రతో కొట్టాడని, తర్వాత తనను గదిలో ఇటూఅటూ నడవమన్నారని చెప్పారు. తాను నడిచానని, ఆ తర్వాత మళ్లీ అరికాళ్లపై కొట్టారని, మళ్లీ నడవమన్నారని, ఈసారి తాను నడవలేకపోయానని ఆయన అన్నారు. అప్పుడు వాళ్లు వెళ్లిపోయారని ఆయన అన్నారు.

అరెస్టు తర్వాత తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆయన ఫిర్యాదు చేస్తూ కొందరి పేర్లు కూడా చెప్పారు. రఘురామ కృష్ణమ రాజు చెప్పిన విషయాలను మెజిస్ట్రేట్ రికార్డు చేసుకున్నారు. ఎంపీనైన తనను అరెస్టు చేసినప్పటి నుంచి సిఐడి అధికారులు పలు రకాలుగా ఇబ్బంది పెట్టారని, అరెస్టుకు ముందు లోకసభ స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు. 

Also Read: సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణమ రాజు స్పెషల్ లీవ్ పిటిషన్

రఘురామకృష్ణమ రాజును ఆరో మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే సమయంలో మీడియాను నియంత్రించారు. కోర్టు ప్రాంగణంలోకి రాకుండా ప్రధాన ద్వారం వద్దనే ఆపేశారు. ఎంపీ కాళ్లకు ఉన్న గాయాలను ఫొటోలన న్యాయవాదులతో పోలీసులు వాదనకు దిగారు.