నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ మధ్య మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా మీడియా ద్వారా చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తూ.. ఆ పార్టీకి పక్కలో బల్లం లా మారిన ఆయన.. తాజాగా ఆ పార్టీ నేతలపై సెటర్లు మరింత పెంచారు.  గత ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత జరగిన ఓ సంఘటనను మీడియా ముందు చెప్పిన ఆయన తనలోని నటనా శైలిని కూడా బయటపెట్టాడు.

పార్లమెంట్ వెలుపల గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికైన కొత్తలో ఎంపీలతో సీఎం జగన్ సమావేశమైనప్పటి సంగతులను చెప్పుకొచ్చారు. ఓ వైసీపీ నేతలా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. 


‘‘మా ఎంపీలందరినీ పిలిచినప్పుడు జరిగిన సమావేశంలో గొప్ప నాయకుడిని చూశాను. ఆయనెవరో పేరు చెప్పే ధైర్యం చేయలేను. అందరి అనుభవాలు చెప్పాలని ఎంపీలను సీఎం జగన్ కోరగా.. ఓ వ్యక్తి నిల్చుని... ‘అరిటాకులు కోసుకొనేవాడిని.. జగన్ గారు’ అంటూ సొమ్మసిల్లి పడిపోయేంత పని చేశారు. అరేరే.. శివాజీ గణేశ్ లాంటోడు బతికుంటే ఇది చూసి చనిపోయేవారు. లేదా ఇప్పటి కమల్ హాసన్ లాంటోడు చూసినా... ఈ నటనకు చచ్చిపోతాడు. అంతటి నటుడు ఎవరో నేను చెప్పలేను. రాజ్యాంగం ఆ రక్షణ నాకు ఇవ్వలేదు. మహానటుడిని చూసి సీఎం జగన్ నిజం అనుకున్నారు. 

అలాంటి వాళ్లు ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు. వెంటనే ఆయన్ని పేరుతో పిలిచిన జగన్... నీ అనుభవాలను మీడియాతో పంచుకో అంటూ బాగా ప్రోత్సహించారు. మంచి మంచి పదవులు కూడా కట్టబెట్టారు. అద్భుతమైన ప్రసంగాలు చేశారు కాబట్టి విద్యాధికుడనే అనుకుంటున్నాను. జగన్ గారు.. మీకు సినిమాలంటే చాలా ఇష్టమని తెలుసు. మీరు సినిమా నటులను చిన్నప్పుడు ఇష్టపడేవారని తెలుసు. కానీ నిజజీవితంలో నటించేవాళ్లను నమ్మకండి.  ఎవరైనా పొగడ్తలకు పడిపోతారు. మహానటులు మీ చుట్టూ ఉన్నారు. కానీ వారు చెప్పేవి నిజం అనుకోకండి. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటుంది. నేను మాట్లాడుతున్నట్టు. మిమ్మల్ని కలిసే అర్హత కోల్పోయానని నిన్న ఒకరు అన్నారు. దిగులు పడటం లేదు. మిమ్మల్ని కలవడం లేదని ఆ శివాజీ గణేశ్‌లా ఏడవనండి. మీది నాది వన్ సైడ్ లవ్... మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను... మీరు ప్రేమించడం లేదు. అంతే. మీరు ప్రేమించకపోతే ఇంకొకరిని చూసుకుంటాను’’ అంటూ తనదైన శైలిలో మాట్లాడారు.