అమరావతి: పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లడం వృధా ప్రయాసే అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

వైసీపీ ఎంపీలు ఈ నెల 3వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఒం బిర్లాను కలిసేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ విషయమై గురువారం నాడు ఆయన స్పందించారు.  ప్రభుత్వ డబ్బునను వృధా చేసేందుకే ఎంపీలు ఢిల్లీకి వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇప్పటివరకు జరిగిందంతా సీఎం జగన్ కు తెలియకుండానే జరిగిందని భావించానన్నారు. కానీ ప్రత్యేక విమానంలో  ఎంపీలు ఢిల్లీకి రావడమనేది  సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని తనకు అర్ధమైందన్నారు.

దేవుడి భూములు అమ్మడం సరికాదని చెప్పానని సీఎం స్పందించి భూముల అమ్మకాన్ని నిలిపివేయించారని గుర్తుచేశారు. పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఇసుక, భూముల విషయాల్లో తప్పులు జరుగుతున్నాయని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. 

also read:రేపు ఢిల్లీకి వైసీపీ ఎంపీలు: రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ ఇచ్చే ఛాన్స్

తాను లేవనెత్తిన అంశాలకు పార్టీకి ఏ సంబంధం ఉందో తెలియడం లేదన్నారు. ఢిల్లీలో బాలశౌరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూస్తానని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే పార్లమెంట్లో ఎంపీలు ఎవరూ కూడ ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ పెద్దలు ఢిల్లీలో చేయాలనుకొన్న ప్రయత్నాలను విరమించుకోవడం మంచిదన్నారు. 

తిరుపతి వెంకన్న భూములను విక్రయించొద్దని చెబితే అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంకటేశ్వరస్వామి దయతో తాను అగ్నిపునీతుడిగా  తిరిగి వస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.