ఏలూరు: తన నివాసాలతోపాటు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారంటూ వస్తున్న వార్తలపై నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు స్పందించారు. 

తన నివాసంలో కానీ, కార్యాలయాల్లోకానీ ఎలాంటి సోదాలు కానీ దాడులు కానీ జరగలేదన్నారు. సీబీఐ అధికారులు స్టేట్మెంట్ కోసం వచ్చారని చెప్పారు. తాను బ్యాంకులో రూ.600 కోట్లు రుణం తీసుకున్నానని అవి చెల్లించడం కాస్త ఇబ్బందిగా మారిందన్నారు. 

ఈ అంశంపై బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారలు వచ్చి తమ కంపెనీి చెందిన లావాదేవీల విషయాలపై ప్రశ్నించడం జరిగిందన్నారు.  ఎన్నికల ముందు ఒకసారి వచ్చి తన స్టేట్మెంట్ తీసుకున్నారని, మళ్ళీ ఇప్పుడు వచ్చి తన స్టేట్మెంట్ తీసుకున్నారని అవి వారి ఫార్మాల్టీస్ అంటూ రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. 

చట్టాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టం తన పని తాను చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. రూ. 600 కోట్లు అప్పు ఉన్న మాట వాస్తవమేనని, తమ పవర్ ప్రాజెక్ట్ కంపెనీలో నష్టాల వల్ల బ్యాంకుకు రుణం తిరిగి చెల్లించలేకపోయామని తెలిపారు. బ్యాంకుకు వన్ టైం సెటల్మెంట్ చేసుకునేందుకు దరఖాస్తు కూడా చేసినట్లు స్పష్టం చేశారు.