ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో.... ఇప్పుడు ఇక మూడు రాజధానుల ఏర్పాటు  లాంఛనమే. 

గవర్నర్ ఆమోద ముద్ర వేయడంపై ప్రతిపక్ష టీడీపీ, అమరావతి ప్రాంత ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఈ విషయంపై స్పందించారు. 

మూడు రాజధానుల పేరుతో రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని రఘురామకృష్ణమరాజు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు..ఇది ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహమని, నయ వంచన అని, తడి గుడ్డతో గొంతు కోయడమేనని ఆయన ప్రభుత్వ చర్యను దుయ్యబట్టారు. 

మూడు రాజధానులనేదే మోసమని, అసలు మూడు రాజధానులు అనేదేలేదని, ఉన్నదీ ఒకటే రాజధాని అని.. దాన్నే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. 

న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. అమరావతి రైతులకు తోడుగా రాష్ట్ర ప్రజలందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 

అమరావతి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా రాజధానులు మారుస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని, ఈ రాజధానుల మార్పు వల్ల అధికంగా ప్రజాధనం వృధా అవుతుందని రఘురామ వ్యాఖ్యానించారు.