అమరావతి: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజును శనివారం రెండో రోజు సీఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఆయనను సీఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్థరాత్రి వరకు ఆయనను ప్రశ్నించారు. 

రఘురామకృష్ణమరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సిఐడి కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. కార్యాలయం వెలుపల అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు. రఘురామకృష్ణమ రాజు ఆరోగ్యం బాగా లేదనే వ్యాఖ్యల నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడితే ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్స్ ను అందుబాటులో ఉంచారు. 

రఘురామరాజుపై మోపిన కేసులో సిఐడి అధికారులు రెండు టీవీ చానెల్స్ ను కూడా నిందితులుగా చేర్చిందిది. ఎ2గా టీవీ5 చానెల్ ను, ఎ3గా ఏబీఎన్ చానెల్ ను చేర్చింది. టీవీ5, ఏబీఎన్ టీవీ చానెళ్లతో కలిసి రఘురామకృష్ణమ రాజు కుట్ర చేశారని సిఐడీ ఆరోపిస్తోంది. సిఐడి డీఐజీ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసింది. రఘురామకృ్ణ కృష్ణమరాజు కోసం ఆ రెండు టీవీ చానెళ్లు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించి కుట్ర చేశాయని సిఐడి ఆరోపించింది.

ఇదిలావుంటే, పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఆశపడి హైదరాబాదు వచ్చిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజును ఏపీ సీఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు రావడం ద్వారా అరెస్టుకు ఆయన అవకాశం కల్పించారు. ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. 

రఘురామకృష్ణమ రాజును సీఐడది పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట వరకు ప్రశ్నించారు. సిఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. గుంటూరులోని తమ కార్యాలయంలో రఘురామకృష్ణమ రాజును ప్రశ్నించారు. 

సామాజిక వర్గాల మధ్య విద్వేషం సృష్టించే విధంగా రఘురామకృష్ణమ రాజు ఎందుకు వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని రాబట్టడానికి సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రఘురామకృష్ణమ రాజు వెనక ఎవరున్నారనే కోణంలో కూడా సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. 

కాగా, సీఐడి బృందాలు రెండు ఇంకా హైదరాబాదులోనే మకాం వేశాయి. రఘురామకృష్ణమ రాజుకు సాంకేతిక సహాయం అందించినవారిపై ఆ బృందాలు దృష్టి పెట్టాయి. రఘురామకృష్ణమ రాజును శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో ఏపీ సీఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కాగా, రఘురామకృష్ణమ రాజు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ మీద ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ పూర్తయ్యే వరకు రఘురామకృష్ణమ రాజును రిమాండ్ కు తరలించవద్దని కోర్టు సిఐడిని ఆదేశించింది. 

తొలుత రఘురామకృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరి ప్రోద్బలంతో పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి అధికారులు ఆయనను ప్రశ్నించారు. రఘురామకృష్ణమ రాజు వాంగ్మూలాన్ని సిఐడి అధికారులు రికార్డు చేశారు.