కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం లేకుండా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు అరెస్టు సాధ్యం కాదని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు.
అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం లేకుండా వైసీపీ ఎంపి రఘురాము కృష్ణమరాజును అరెస్టు చేసే అవకాశమే లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అభిప్రాయపడ్డారు. సదరు ఎంపీ తన సొంత పార్టీ పై బహిరంగ విమర్శలు చేయడాన్ని తప్పు బట్టారు. ఆయన విమర్శల విషయంలో పార్టీ పరంగా ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకొని సొంత పార్టీపై తిరుగుబాటు చేసినట్టు స్పష్టం చేశారు. ఒక రకంగా అనధికారికంగా ఆయన బీజేపీలొనే ఉన్నారని తెలిపారు.
రాజకీయాల్లో విమర్శలు చేస్తున్న వారిపై కక్ష పూరిత చర్యలు ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని నారాయణ అన్నారు. రఘురామ కృష్ణమరాజు పై పెట్టిన అభియోగాలకు, ఆ కేసులో పెట్టిన సెక్షన్లకు పొంతన లేదని చెప్పారు. కేవలం కక్ష సాధించాలన్న పట్టుదలతోనే ఆ కేసులు పెట్టినట్టు స్పష్టం చేశారు. పైగా ఒక ఎంపీ ని అరెస్టు చేసిన పద్దతి అభ్యతరకరంగా ఉందని, అంత తతంగం అవసరమా అని ప్రశ్నించారు.
రఘురామ ఆరోగ్యం విషయంలో పైగా కోర్టు ఆదేశాలను కూడా పాటించలేదని పేర్కొన్నారు. ఎలాగైనా ఒక్క రోజు అయినా జైలులో పెట్టాలన్న కక్ష అందులో ఉందని చెప్పారు. రఘురామ కృష్ణమరాజు చేసిన వ్యాఖ్యలను తాము సమర్తించడం లేదని, అయితే చట్ట ప్రకారం, కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని వ్యతిరికేస్తున్నామని ఆయన వివరించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణ ఉందని, అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వ్యాక్సిన్ తయారీ కంపెని యజమాని విషయంలో కులం ప్రస్తావన చేశాక ఇంకేమి మాట్లాడగలమని అన్నారు. ఈ విషయంలో యధా రాజా తదా ప్రజ అనుకోవాలేమో అని చురకలు అంటించారు.రఘురాము అరెస్టు విషయంలో రాష్ట్రంలోని బిజెపి స్పందన చాలా వింతగా ఉందన్నారు.
పైస్థాయిలో అరెస్టుకు అనుమతి ఇచ్చి...ఇక్కడ ఆ అరెస్టును ఖండిస్తున్నామని చెప్పడాన్ని తప్పుబట్టారు. రఘు రామ కృష్ణమారాజు విషయంలో సుప్రీం కోర్టు చేసిన ఆదేశాలు అమలు చేసి హైదరాబాదులోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని సూచించారు
దేశవ్యాప్తంగా కక్ష పూరిత రాజకీయాలు విస్తృతమవడంలో నేటి బీజేపీ పాత్ర అధికంగా ఉందని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని, రాజకీయ పార్టీలను లేకుండా చేయాలని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాలను తమగుప్పిట్లో పెట్టుకోవాలని చూశారని, కరోనా మహమ్మారి సమయంలోనూ అదే తరహా చర్యలు కొనసాగిస్తున్నారు అని తెలిపారు. ఎన్నికలు అవగానే బెంగాల్ లోని ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి సిబిఐ ద్వారా ముగ్గురు మంత్రులను అరెస్టు చేయించారని విమర్శించారు. కేంద్రం ఆదర్శంగా కేసీఆర్ కూడా అదే తీరులో ఈటెల రాజేంద్ర విషయంలో ప్రవర్తించారని అన్నారు.
ఎటువంటి కక్ష పూరిత చర్యల ద్వారా ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తే అది సాధ్యం కాదని , ప్రజలే ప్రతిపక్షముగా మారతారనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని నారాయణ హితవు పలికారు.
