సజ్జల వ్యవహారశైలి నాడు టీడీపీలో లక్ష్మీపార్వతిని తలపిస్తుందని.. తొందరగా మేల్కొని ఆయనను పక్కనపెట్టకపోతే పార్టీకి నష్టం.. అంటూ ఎంపీ రఘురామ జగన్ కు సూచించారు. 

ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి పార్టీ చర్యల మీద మాట్లాడారు. అయితే, ఈసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ సూచన చేశారు. అప్పట్లో టిడిపిలో లక్ష్మీపార్వతి వ్యవహరించినట్లుగానే.. నేడు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆ వ్యవహార శైలివల్లే టీడీపీలో సంక్షోభం తలెత్తిందని.. మన పార్టీలో అలా జరగకుండా చూసుకోండి అంటూ ఈ లేఖలో జగన్ కు సూచించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడం వల్లే.. టీడీపీ వ్యవస్థాపకుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంచివారైనా కూడా టిడిపిలో 1995లో సంక్షోభం తలెత్తిందని గుర్తు చేశారు.

‘మన పార్టీలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి.. లక్ష్మీపార్వతి లాగే వ్యవహరిస్తున్నారని చాలామంది అంటున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే సర్దుకోవాలి. ఆయన వ్యవహార శైలితో అనేకమంది పార్టీలో బాధపడుతున్నారు. అసంతృప్తి పెరిగిపోతుంది. ఆయనను పక్కన పెట్టకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుంది. పార్టీలో మెజారిటీ సభ్యులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమిస్తున్నారు. ఒకప్పటి సాక్షి పేపర్ ఉద్యోగి అయిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలను కూడా రిపోర్టు చేయాలడన్నం సరికాదు’ అని పేర్కొన్నారు.

వెన్నుపోటు, కొనటం, నయవంచనే చంద్రబాబు విజయ రహస్యం.. పేర్ని నాని సంచలనం..

 ఆనం రామకృష్ణారెడ్డి.. వైసీపీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఆయన తీరు సహేతుకంగానే ఉందని రఘురామా అన్నారు. ‘మేకపాటి కుటుంబం వైసీపీ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. మేకపాటి గౌతం రెడ్డి జగన్ పార్టీ స్థాపించాలనుకున్నప్పటి నుంచి వెన్నెముకగా ఉన్నారు. ఇక జగన్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు మద్దతుగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం. 

జయ మంగళ వెంకటరమణకు తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానని.. దానివల్లే ఆయన గెలిచారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆయన వాదనలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అంతర్గత నివేదికల ఆధారంగా సస్పెండ్ చేశామని చెప్పడం సిగ్గుచేటు..’ అని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.