టీటీడీ ఛైర్మన్ పదవికి తాను రాజీనామా చేయలేదని తనపై కక్ష కట్టారని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో పుట్టా సుధాకర్  యాదవ్ అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం జగన్ కు స్విమ్స్ డైరెక్టర్  రవికుమార్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పుట్టా మీడియాకు వివరణ ఇచ్చారు.

తాను ఎలాటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఖండించారు. తాను రాజకీయ నాయకుడినని.. వివిధ పనుల కోసం తన దగ్గరకు ఎందరో వస్తుంటారని చెప్పారు. స్విమ్స్‌లో ఉద్యోగం‌ ఇవ్వాలంటూ రిఫరెన్స్ ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. తాను రిఫరెన్స్ ఇచ్చినా.. అధికారులు జీవో ప్రకారమే ఉద్యోగాలిస్తారని గుర్తుచేశారు. 

టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయలేదనే తనపై కొందరు కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. . తన మీద వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. తప్పు చేశానని విచారణలో తేలితే.. ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తిరుమల దర్శనం సందర్భంగా ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వటానికి నాణేలతో కూడిన మెమోంటోను తయారు చేశామన్నారు. 

పూర్వం రాజులు నాణేలను వెంకటేశ్వరుడికి బహుమతిగా ఇచ్చేవారన్నారు. నాణేల విషయం బయటకు రావటం వల్లే ప్రధానికి ఇవ్వాల్సిన మెమోంటోను ఇవ్వలేదని ఆయన మీడియాకు వివరించారు.