పులివెందులలో వైఎస్సార్ సిపి నేత దారుణ హత్య, వేటకొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు

First Published 10, Jul 2018, 1:20 PM IST
Pulivendula YSRCP Leader rangeshwar Reddy Murdered Brutally
Highlights

కడప జిల్లా పులివెందులలో దారుణ హత్య జరిగింది. ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పార్టీ కి చెందిన ఓ నాయకున్ని గుర్తు తెలియని దుండగులు వెంటాడి మరీ వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ హత్యతో పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కడప జిల్లా పులివెందులలో దారుణ హత్య జరిగింది. ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పార్టీ కి చెందిన ఓ నాయకున్ని గుర్తు తెలియని దుండగులు వెంటాడి మరీ వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ హత్యతో పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ హత్యపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన రంగేశ్వర్ రెడ్డి(45) తన కుటుంబంతో కలిసి పులివెందులలో నివాసముంటున్నాడు. ఇతడికి గ్రామంలో ప్యాక్షన్ గొడవలు ఉండటంతో గ్రామానికి దూరంగా ఉంటున్నాడు. ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు.

అయితే కొందరు దుండగులు రెండు సుమోల్లో  ఆటోనగర్ లోని రంగేశ్వర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి వరండాలో ఫోన్ మాట్లాడుతుండగా అతన్ని ఇంట్లోంచి లాక్కువచ్చి నడి రోడ్డుపై దారుణంగా నరికారు. ప్రాణాలు కాపాడుకోడానికి పరుగెడుతున్న రంగేశ్వర్ రెడ్డి ని వెంటాడి మరీ నరికారు. వీరు కత్తులతో తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు చనిపోయాడని నిర్థారణ చేసుకున్నాకే దుండగులు అక్కడినుండి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యతో పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

వైఎస్సార్ సిపి నేత మృతిపై సమాచారం అందుకున్న స్థానిక మాజీ ఎంపి అవినాశ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
   

loader