కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) అనంతపురం జిల్లా (Anantapur district) పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది.ఆహ్వానం అందలేదని నాసిన్ అకాడమీ భూమి పూజ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ రంగయ్య హాజరుకాలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అనంతపురం జిల్లా ( Anantapur district) పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఆహ్వానం అందలేదని నాసిన్ అకాడమీ భూమి పూజ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ రంగయ్య హాజరుకాలేదు. అధికారులు సమన్వయ లోపం కారణంగానే వాట్సాప్‌లో ఆహ్వానం అందించారని చెప్పారు. నిర్మలా సీతారామన్ పర్యటనలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం కల్పించడంపై ఆయన మండిపడ్డారు. అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులు రెండు మూడు రోజుల ముందే చెప్పాల్సిందని.. కానీ అలా జరగలేదని అన్నారు. ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. వాట్సాప్‌లో ఆహ్వానం పెట్టారని చెప్పారు. అసలు కార్యక్రమం ఎలా చేస్తున్నారనే సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు పార్లమెంట్ సభ్యునికి ఆహ్వానం అందించాల్సి ఉంటుందన్నారు.
ఇన్విటేషన్‌లో తన పేరు లేదని ఫిర్యాదు చేసిన ఎంపీ గోరంట్ల మాదవ్
కేంద్ర అధికారుల తీరుపై మరో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. నాసిన్ ఇన్విటేషన్‌లో తన పేరు లేదని మాదవ్ తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక, జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సంస్థ(NACIN)కు నిర్మలా సీతారామన్ శనివారం భూమి పూజ చేశారు. 500 ఎకరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి శంకరనారాయణ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. ఇక, తొలుత బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న నిర్మల సీతారామన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాలసముద్రం చేరుకున్నారు.
