Asianet News TeluguAsianet News Telugu

ఆదాయం మీకు... అపనింద కేంద్రానికా..?: పన్నుల పెంపుపై బిజెపి ఎంపీ సీరియస్

రాష్ట్ర అప్పులు తీర్చుకొనేందుకు పన్నులు పెంచి కేంద్రంపై నింద మోపుతారా? అని జగన్ సర్కార్ పై బిజెపి ఎంపీ జివిఎల్ మండిపడ్డారు. 

Property tax hike in ap... bjp mp gvl serious on ap government
Author
Amravati, First Published Jun 16, 2021, 4:20 PM IST

విశాఖపట్నం: రాష్ట్రంలో పన్నుల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని బీజేపీ ఎంపీ జీవియల్ నరసింహరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా పన్నుల పెంపుపై ఆదేశాలు ఇవ్వలేదని... అలాగయితే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలికదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో ఆస్థి పన్నులు పెంచలేదని జివిఎల్ స్పష్టం చేశారు. 

''అప్పులు తీర్చుకొనేందుకు పన్నులు పెంచి కేంద్రంపై నింద మోపుతారా? కేంద్రానికి పన్నుల పెంపుకు సంబంధం లేదు. పన్నుల భారంతో ఆర్జన మీకు, అపనింద కేంద్రానిదా? కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలన్నింటికీ మీ స్టికర్లు వేసుకొని, పన్నుల నిర్ణయాన్ని కేంద్రానికి ఆపాదిస్తారా? ఎంత మోసం? అప్పులు చేసి పన్నులు వేసేది ఏపీ ప్రభుత్వం. అపవాదులు కేంద్ర ప్రభుత్వానికా?'' అంటూ మండిపడ్డారు. 

read more  రాజధాని రైతుల ఖాతాల్లో రూ.195కోట్లు... జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

''పన్నుల పెంపుకు కూడా "జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం" అని పేరు పెట్టుకోండి. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంత కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టు కింద ఏపీకి 8.16లక్షల కోట్ల నిధులు పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ కింద ఏపీకి నిధులు ఇచ్చాము. పిఎంఏవై కిందా రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే జగనన్న కాలనీలు అని మీ పేరు పెట్టుకొని  ప్రచారం చేసుకుంటారా?'' అని నిలదీశారు. 

''పన్నుల పేరుతో కరోనా కష్ట కాలంలో ప్రజలపై  భారాలు మోపుతారా? పన్నులు మీరు పెంచుతూ నెపం బీజేపీపై నెడతారా. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పెంచుతూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ఈ నిరసనను తీవ్రతరం చేసి ప్రజల సహాయ నిరాకరణ కార్యక్రమంగా చెప్పటం జరుగుతుంది'' అని జివిఎల్ హెచ్చరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios