టీడీపీ-కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్ పొందారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై విమర్శలు చేశారు. 

గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలోనే అశోక్ బాబు (Ashok babu) అడ్డ‌దారిలో ప్ర‌మోష‌న్ పొందార‌ని వైఎస్ఆర్ సీపీ (YSRCP) అధికార ప్ర‌తినిధి నాగార్జున యాద‌వ్ (Nagarjuna yadav) ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఫోర్జరీ సర్టిఫికెట్లతో, ప్రభుత్వ సర్వీసు రికార్డుల్లో ట్యాంపరింగ్ చేసి ప్రమోష‌న్ పొందిన అశోక్ బాబును సీఐడీ అరెస్టు చేయడంతో టీడీపీ నాయ‌కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ని అన్నారు. టీడీపీ (tdp) ఎమ్మెల్సీగా ఉన్న అశోక్‌ బాబు అక్రమాలను సమర్థిస్తున్న చంద్రబాబు నాయుడి (chandrababu nayudu)ని తమ పార్టీ త‌ర‌ఫున కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతున్నామ‌ని వాటికి ఆయ‌న స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. 

చదవని డిగ్రీతో అశోక్ బాబు పదోన్నతి పొందిన మాట వాస్తవమా ? కాదా అని ప్ర‌శ్నించారు. ఇంటర్మీడియట్ (intermediat) క్వాలిఫికేషన్ మీద కమర్షియల్ ట్యాక్స్ హెడ్ ఆఫీసు (commercial tax head office)లో ఉద్యోగం పొంద‌టం ఆయ‌నకు ఎలా సాధ్య‌మైంద‌ని అడిగారు. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతోనే ఆయ‌న‌ను సీఐడీ (cid) పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ విష‌యంలో సీఎం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నాయ‌కులు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాద‌ని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అశోక్ బాబు ఇచ్చిన అఫిడవిట్‌లో ఇంటర్మీడియ‌ట్ అర్హ‌త ఉంద‌ని స్పష్టంగా పేర్కొన్నార‌ని గుర్తు చేశారు. ఆయ‌న డిగ్రీ చ‌ద‌వ‌క‌పోవ‌డాన్ని తాము త‌ప్పుప‌ట్ట‌డం లేద‌ని, కానీ ఫోర్జరీ సర్టిఫికెట్లు పెట్టి ప్ర‌భుత్వాన్ని, అధికారుల‌ను, ప్ర‌జ‌ల‌ను తప్పు దారి ప‌ట్టించ‌డాన్ని తాము తీవ్రంగా ఆక్షేపిస్తున్నామ‌ని అన్నారు. 

2013లో ‘‘సైకిల్‌ - కాంగ్రెస్’’ అధికారంలో ఉన్నప్పుడు తొలిసారి అశోక్ బాబుకు చెందిన ఫేక్‌ డాక్యుమెంట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని నాగార్జున యాదవ్ అన్నారు. ఆయ‌న చేసిన తప్పు కప్పిపుచ్చుకునే క్రమంలోనే చంద్రబాబు పంచన చేరాడ‌ని విమ‌ర్శించారు. దీనినే అవ‌కాశంగా చేసుకొని అత‌డిని సమైక్య ఉద్యమంలోకి చొప్పించి, ఆ ఉద్యమాన్ని ఏ విధంగా నీరుగార్చారో అంద‌రూ చూశార‌ని తెలిపారు. ఈ విష‌యాల‌పై టీడీపీ నేత‌లు సమాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తప్పుడు పనులను, తప్పుడు వ్యక్తులను ప్రోత్సహించి సీఎంపై విమర్శలు చేయడం మంచిది కాద‌ని చెప్పారు. 

చేసిన తప్పుకు శిక్ష విధించే అవ‌కాశం కోర్టులకు, చట్టానికి ఉంటుంద‌ని, దీంట్లో క‌క్ష సాధింపు చ‌ర్య‌లు ఎక్క‌డున్నాయ‌ని నాగార్జున యాద‌వ్ ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో లోకాయుక్తా 2021 ఆగస్ట్‌ 16న పూర్తి స్థాయి విచారణ చేయాలని సీబీ సీఐడీకి ఉత్తర్వులు జారీ చేసింద‌ని అన్నారు. దాని ప్ర‌కారమే వివిధ సెక్షన్ల ప్రకారం 2022 జనవరిలో సీబీసీఐడీ పోలీసులు అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్టార‌ని, ఇవ‌న్నీ వాస్త‌వాల‌ని అన్నారు. అక్రమాలు, ఫోర్జరీలు, తప్పుడు పనులు చేసినా కాపాడుతామనే చందంగా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తీవ్రంగా ఆరోపించారు. అలాంటి వారిటీ చంద్రబాబు నాయుడు భుజాల మీద వేసుకుని మోస్తార‌ని తెలిపారు. వీటిని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని కోరారు. ఇలా త‌ప్పుడు ప‌త్రాల‌తో చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగు పెట్టిన నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సేవ చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇలా ఫేక్ డ్యాక్యుమెంట్ల‌తో ఉద్యోగం పొందిన అశోక్ బాబు విష‌యంలో గ‌తంలోనే ఎల్లో మీడియాలో వార్తలు ప్ర‌సారం చేసింద‌ని అన్నారు.