కడప జిల్లాలో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తోంది. ప్రధానంగా అందరి వేళ్లూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వైపే చూపిస్తున్నాయి.

సుబ్బయ్య భార్య అపరాజితతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తదితరులు శివప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు స్పందించారు.

నారా లోకేశ్‌ ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తానంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొని ఊరొదిలి వెళ్లిపోతానని శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు.

నందం సుబ్బయ్యను శివప్రసాద్‌రెడ్డి హత్య చేశాడని ప్రజలు నమ్మితే నాకు ఓటేయండని నువ్వు ప్రజలను ఓటు అడుగు అని లోకేశ్‌కు సూచించారు. హత్య చేయలేదని మీరు నమ్మితే నాకు ఓటు వేయండి అని నేను జనాన్ని అడుగుతానని శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

ఒకవేళ తాను కనుక ఆ ఎన్నికల్లో ఓటమిపాలైతే ఆ మరుక్షణమే రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తానని, అంతేకాకుండా ఊరు వదిలి వెళ్లిపోతానని లోకేశ్‌కు శివప్రసాద్‌రెడ్డి సవాల్‌ విసిరారు.  

అంతకుముందు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ఆలయంలో ప్రమాణం చేశారు. ప్రొద్దుటూరులోని చౌడేశ్వరీ ఆలయానికి వెళ్లిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. సుబ్బయ్య హత్యతో తనకు సంబంధం లేదంటూ అమ్మవారి పాదాలపై సత్యప్రమాణం చేశారు.

తాను తప్పు చేస్తే అమ్మవారే తనను శిక్షిస్తుందన్నారు. హత్య గురించి ముందే తెలిసుంటే సుబ్బయ్యను రక్షించి ఉండేవాడినన్నారు. హత్యకు సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అవసరమైతే తన తల్లిదండ్రులపైనా ప్రమాణం చేస్తానని రాచమల్లు స్పష్టం చేశారు.