మామ పేరుమీద జీవితబీమా చేయించి.. పథకం ప్రకారం స్నేహితుడితో కలిసి అంతమొందించాడు ఓ అల్లుడు. హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించే క్రమంలో పట్టుబడ్డాడు. వారిద్దరికీ జీవితఖైదు పడింది.
వైయస్సార్ జిల్లా : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా న్యాయస్థానం ఇద్దరు నేరస్తులకు జీవిత ఖైదు విధించింది. బీమా సొమ్ము కోసం స్నేహితుడితో కలిసి సొంత మామనే అంతమందించాడు. ఈ కేసులో నేరస్తులైన రాయపాటి కిరణ్ కుమార్ రెడ్డి, మల్లెం శ్రీనివాసరెడ్డిలకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించినట్లుగా ఎర్రగుంట్ల సీఐ మంజునాథరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే… వైయస్సార్ జిల్లాలోని పొద్దుటూరు పట్టణానికి చెందిన యరవల చెన్న కృష్ణారెడ్డి (59), లక్ష్మీ ప్రసన్న భార్యాభర్తలు.
సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామానికి చెందిన రాయపాటి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. అతనికి తమ పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి అత్తామామలతో చాలా బాగా ఉండేవాడు. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత మామ చెన్న కృష్ణారెడ్డి పేరు మీద కోటి రూపాయలకు జీవిత బీమా చేయించాడు కిరణ్.ఆ బీమా పత్రాల్లో నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. బీమా చేయించింది కిరణ్ కుమారే కావడంతో ఎవరు దీనిమీద అనుమానం వ్యక్తం చేయలేదు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం..90 బైక్ లు దగ్థం..
ఆ తర్వాత కొద్ది రోజులకు తన స్నేహితుడైన మల్లెల శ్రీనివాసరెడ్డితో కలిసి 2019 జనవరి 30న చెన్న కృష్ణారెడ్డిని కారులో ఎక్కించుకొని ముగ్గురు కలిసి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మార్గమధ్యంలో చెన్న కృష్ణారెడ్డిని స్నేహితుడి సహాయంతో హతమార్చాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు సమీపంలోని పోట్లదుర్తి వద్ద రోడ్డు మీద విసిరేశాడు. రోడ్డు ప్రమాదంగా మామ హత్యను చిత్రీకరించాలని ప్రయత్నించాడు.
అయితే, అక్కడ ఉన్న స్థానికులు వీరు మృతదేహాన్ని రోడ్డుమీద వేయడం గమనించారు. వెంటనే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. అప్పటినుంచి విచారణ కొనసాగుతున్న ఈ కేసులో మంగళవారం ప్రొద్దుటూరు న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జీఎస్ రమేష్ కుమార్ ఈ నేరస్థులు ఇద్దరికీ జీవిత ఖైదు విధించారు. దీంతోపాటు ఒక్కొక్కరికి రూ. 11 లక్షల చొప్పున జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించలేకపోతే మరో ఎనిమిదేళ్లు అదనంగా జీవిత ఖైదు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిచ్చారు.
