ఉండూరొదిలి అనంతపురం (లోక్ సభస్థానానికి)  వలసపోయాకే జెసి దివాకర్ రెడ్డికి కష్టాలొస్తున్నాయి. ఈ కష్టాలెంతవరకు వచ్చాయంటే,ఒక ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు సత్యాగ్రహానికి పూనుకోవలసి వచ్చింది.

జనరల్ గా ఆయన అలగడమనేది జరగదు. రిపబ్లిక్ ఆప్ తాడిపత్రిలో ఆయన ఎవరిమీదో అలగాల్సిన పనుండదు.

 మంచికయినా చెడుకయినా ఆ రాజ్యంలో ఆయన మాటకు ఎదురుండదు. మాటే మంత్రమూ, దండమూ. ఉండూరొదిలి అనంతపురం (లోక్ సభస్థానానికి) వలసపోయాకే జెసి దివాకర్ రెడ్డికి కష్టాలొస్తున్నాయి. ఈ కష్టాలెంతవరకు వచ్చాయంటే,చివరకు ఒక ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు సత్యాగ్రహానికి పూనుకోవలసి వచ్చింది. దానిని కూడా పోలీసులువిచ్ఛన్నం చేశారు నిన్న. 

ఈ కుళ్లు రాజకీయాలలో ఇక ఉండను అని కూడా ఆ మధ్య ప్రకటన చేసి సంచలనం సృష్టించిన సంగతి చాలా మందికి గుర్తుండేఉంటుంది.

అనంతపురంలో తాను ప్రతిపాదించిన రోడ్ల విస్తరణ ప్రాజక్టుకు స్థానిక ఎమ్మెల్యే, నగర మేయర్ అడ్డుపడుతున్నారని, ఆయన మునిసిపాలిటీలో బయటా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అదేదో తాడిపత్రిలో చేసుకోపో, అనంతపురం జోలికి రావద్దని వారుచెప్పేశారు. దాంతో ఆయనకు కోపమొచ్చి, అనంతపురం మునిసిపాలిటి కమ్మ కంపు గొడుతూ ఉందని బాహాటంగా అనేశారు. అప్పటికీ మార్పు రాకపోతే, సోమవారం నిరసనదీక్షకు పూనుకొన్నారు. నగర పాలకసంస్థ కార్యాలయం ఎదుట ఈ దీక్ష ప్రారంభించారు.

అధ్వాన్నంగా ఉన్న నగరం పారిశుధ్యత మెరుగుపర్చాలి, ప్లాస్టిక్ వినిషేధించాలి, రోడ్లను విస్తరించాలి అనేవి అయన డిమాండ్లు. ఈ డిమాండ్లతో ఆయన గతంలో తాడిపత్రి రూపురేఖలు మార్చారు.


అయితే, ఈ ‘తాడిపత్రి డిమాండ్ల’ను ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి, నగర మేయర్ స్వరూప అనంత పురానికి రానీయడం లేదు. ఎంపికి సహకరిస్తే ఎసిబి కేసులు పెట్టిస్తామంటూ కార్పొరేషన్ అధికారులను బెదిరిస్తూ తనకు సహకరించకుండా చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 


 అనంతపురం వోల్డ్ టవున్ లో తిలక్‌రోడ్డు, గాంధీబజార్ రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, దానిని వెడల్పు చేయాలని ప్రభుత్వం నుంచి రూ.70 కోట్ల నిధులు మంజూరుచేయించానని ఆయన అంటున్నారు. వీరు అడ్డుకుంటూ ఉండటంతో గత 11 నెలలుగా ఈ నిధులు మురిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 ఈపనులన్నీ చేస్తే, అనంతపురం మీద జెపి బ్రదర్స పట్టు బిగుసుకుంటుందని అవతలి పక్షం భయపడుతున్నదనేది జెసి ఆరోపణ.

ఈ నేపథ్యంలో ఆయన దీక్షకు పూనుకున్నారు. 


దీక్ష విరమించాలని మున్సిపల్ అధికారులు నచ్చజెప్పినా దివాకర్‌రెడ్డి వినిపించుకోలేదు. దీనితో రంగంలోకి దిగిన డాక్టర్లు పరీక్షలు జరిపి షుగర్ లెవెన్స్ పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 


దీనితో సాయంత్రం 6 గంటలపుడు పోలీసులు సత్యాగ్రహ శిబిరంలోకి చొరబడి ఎంపిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. తర్వాత వ్యూహాత్మకంగా విజయవాడ అసుపత్రులకు కాకుండా హైదరాబాద్‌కు తరలించారు.


సిఎం వద్దన్న దీక్ష చేపడుతానని దివాకర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. దీంతో సిఎం దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.


2014 ఎన్నికల ముందు కాంగ్రెసొదిలి టిడిపి లో చేరి ఆయన అనంతపురం ఎంపిగా గెలుపొందారు. అయితే, టిడిపిలో ఆయనకేం విలువనీయడంలేదు. ఇపుడాయన పరిస్థితి: టిడిపి నుంచి బయటకు రాలేడు, అక్కడ ఉండనూ లేడు.