ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా పాఠశాలల నిర్వహణ ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మించి అనుమతి లేదని ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ గదులు సరిపోనిచోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నట్లు సురేశ్ పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. పాఠశాలల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.