శివునికి పూజ చేస్తూ.. గుడిలోనే ఓ పూజారి ప్రాణాలు వదిలారు. ఈ విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరంలోని సోమేశ్వర జనార్ధనస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు కందుకూరి వెంకటరామారావు నిత్యం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

రోజూలాగానే ఆయన ఈ నెల 11వ తేదీన ఆయన ఈశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ..శివలింగంపైనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందాడు. గుండెపోటు కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు.
 
వెంకటరామారావు పూజలు నిర్వహిస్తూ ఉండగా కుప్పకూలిన దృశ్యాలు చూసినవారిని కలచివేశాయి. మొదట ఓసారి ఆయన పడిపోయారు. సహ అర్చకుడు వచ్చి ఆయనను లేపి నిల్చోబెట్టారు. మళ్లీ కాసేపటికే ఆయన పక్కనే ఉన్న శివలింగంపై పడిపోయాడు. 

ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గుడిలోని అర్చకులంతా కలిసి ఆయనను బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకటరామారావు మృతి చెందారు. గర్భగుడిలోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. వెంకట రామారావు గత 40 సంవత్సరాలుగా ఇదే ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.