ఫైబర్ గ్రిడ్ సేవలను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ఒకే కనెక్షన్ ద్వారా మూడు సేవలను అందించే ఫైబర్ గ్రిడ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఒకే కనెక్షన్ ద్వారా కేబుల్ టివి, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను అందించే వ్యవస్ద పై రాష్ట్రపతికి చంద్రబాబునాయుడు వివరించారు. నెలకు రూ. 149 కే మూడు రకాల సేవలను అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేయగా రోజంతా వైఫై, 15 ఎంబిపిఎస్ స్పీడ్ వేగంతో ఇంటర్నెట్, కేబుల్ టివిలో 250 ఛానళ్ళు ప్రసారావలనున్నాయి. విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకుని గ్రిడ్ కనెక్షన్లను ప్రభుత్వం ఇళ్ళకు అనుసంధానం చేస్తోంది. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 400 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ఐటి మంత్రి నారా లోకేష్ తదితర మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.