విజయవాడ రైల్వే ఉద్యోగికి అత్యున్నత అవార్డ్... రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా...
పారా క్రీడల్లో రాణిస్తున్న విజయవాడ రైల్వే ఉద్యోగి సుబ్బయ్య కుమార్ ను ''శ్రేష్ఠ దివ్యాంగన్ 2021'' అవార్డ్ వరించింది. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.
విజయవాడ : అంగవైకల్యాన్ని బలహీనంగా కాకుండా బలంగా చేసుకుని అంతర్జాతీయస్థాయి పారా స్పోర్ట్స్ లో అద్భుత విజయాలు అందుకుంటున్న పారా క్రీడాకారుడు సుబ్బయ్య తిరుమలయి కుమార్ కు అత్యున్నత అవార్డును లభించింది. 2021 సంవత్సరానికి గాను ''శ్రేష్ఠ దివ్యాంగన్'' అవార్డుకు సుబ్బయ్యను ఎంపికచేసింది కేంద్ర ప్రభుత్వం. నిన్న శనివారం (డిసెంబర్ 3న) అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా పారా స్పోర్ట్స్ క్రీడాకారుడు సుబ్బయ్య ఈ అవార్డును అందుకున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో బుకింగ్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు సుబ్బయ్య కుమార్. ఓ వైపు ఉద్యోగ బాధతలు చేపడుతూనే మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీల్లో స్విమ్మింగ్, అథ్లెటిక్ మరియు ఆర్చరీ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 11 బంగారు, 5 వెండి, 4 కాంస్య పతకాలు అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందాడు. ఇలా అనేక అంతర్జాతీయ స్థాయి పారా క్రీడల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ రాణిస్తున్న సుబ్బయ్యను కేంద్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది.
Read More నేడు ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... పర్యటన సాగనుందిలా...
''శ్రేష్ఠ దివ్యాంగన్'' అవార్డును అందుకున్న సుబ్బయ్య కుమార్ ను విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ అభినందించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని మరింతమంది దివ్యాంగులు తమ శరీరంలోని లోపాలను అధిగమించి క్రీడలు, ఇతర రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు.
సుబ్బయ్య కుమార్ ఇప్పటికే భారత్ తరపున అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్, పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లోనూ పాల్గొన్నారు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సుబ్బయ్య పారా క్రీడల్లో అనేక విజయాలు అందుకుని భారత కీర్తిని మరింత పెంచుతున్నాడు.