గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన కొందరు యువకులు అకారణంగా నలుగురిపై దాడిచేసిన ఘటన తెనాలి పట్టణంలో చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు ఓ అపార్ట్ మెంట్ వద్ద పనిచేస్తున్న కూలీలతో అనవసరంగా గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో పదిమంది గంజాయి గ్యాంగ్ కూలీలతో పాటు మరో ఇద్దరిపై రాడ్లు, కర్రలు, బ్యాట్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నందులపేట కవిరాజ పార్క్ వద్ద గల ఓ అపార్ట్ మెంట్ లో ఇద్దరు కూలీలు పనిచేస్తుండగా ముగ్గురు యువకులు అటువైపు వచ్చారు. గంజాయి మత్తులో వున్న యువకులు ఆటో లోంచి సిమెంట్ బస్తాలు దింపుతున్న కూలీలలో గొడవ పెట్టుకున్నారు. ఆటోపై దాడి చేయడంతో పాటు కూలీలను కొట్టడానికి ప్రయత్నించగా అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్, వాచ్ మెన్ అడ్డుకున్నారు. దీంతో అక్కడినుండి వెళ్లిపోయిన యువకులు మరికొందరితో తిరిగివచ్చి కూలీలతో పాటు అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్, వాచ్ మెన్ పై దాడికి దిగారు. 

వీడియో

10 మంది గంజాయి బ్యాచ్ కర్రలు, బ్యాట్లు, రాడ్లు, రాళ్లతో అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుని మొదట కూలీలపై దాడిచేసారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్, వాచ్ మెన్ పై కూడా దాడికి దిగారు. భయంతో పారిపోతున్నా విడిచిపెట్టకుండా వెంటపడి మరీ నలుగురిని చితకబాదారు. ఇలా గంజాయి బ్యాచ్ దాడిలో ఇద్దరికి తలలు పగిలి తీవ్ర గాయాలవగా మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

Read More టీడీపీ నేతపై ఎస్సై పిడిగుద్దులతో దాడి.. వైసీపీ వ్యతిరేక నిరసనలో ఉద్రిక్తత.. !!

తీవ్రంగా గాయపడిన ఇద్దరు తెనాలి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే వుంది. అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన గంజాయి బ్యాచ్ ను గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి దృశ్యాలు అపార్ట్ మెంట్ లోని సిసి కెమెరాల్లో రికార్డవగా వాటి ఆధారంగా గంజాయి బ్యాచ్ ను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

గంజాయి బ్యాచ్ వీరంగంతో తెనాలిలో ఒక్కసారిగా భయానక పరిస్థితి నెలకొంది. గంజాయి మత్తులో యువత నేరాలబాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గంజాయి సరఫరాను అడ్డుకోవాలని... తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ఓ కన్నేసి వుంచాలని కోరుతున్నారు. యువత కూడా గంజాయి మత్తులో భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.