ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఇంకా రవాణా సదుపాయాలే సరిగా అందడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖమన్యంలో రవాణా సదుపాయం లేక అంబులెన్స్ అక్కడికి చేరుకోలేక ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులతో పాపకు జన్మనిచ్చి మరణించింది. ఈ ఘటన మన్యంలో విషాదాన్ని నింపింది.
అమరావతి: విశాఖ మన్యంలో విషాదం నెలకొంది. ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడి పాపకు జన్మనిచ్చి మరణించింది. వైద్య సేవలు సకాలంలో అందక దుర్ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ కోసం ఫోన్ చేసినా.. అది రావడానికి వీలయ్యేలా దారులు లేకపోవడంతో ఆ గర్భిణికి వైద్య సేవలు అందలేవు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ మారుమూల ప్రాంతం ఎదురుపల్లిలో చోటుచేసుకుంది.
Also Read: 108 అంబులెన్స్ లోనే ప్రసవించిన కరోనా పాజిటివ్ మహిళ...
ఎదురుపల్లిలో గెమ్మిల బాబురావు, గెమ్మిల దివ్య భార్య భర్తలు వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు బాబులు, ఒక పాప. 27ఏళ్ల దివ్య మరోసారి గర్భందాల్చింది. నెలలు నిండాయి. పురిటి నొప్పులు వచ్చాయి. వైద్య సేవల కోసం వారు అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. కానీ, రవాణా సౌకర్యం లేక అంబులెన్స్ అక్కడికి రాలేకపోయింది. దీంతో పురిటినొప్పులకు తాళలేక దివ్య తుదిశ్వాస విడిచింది. దీంతో ఎదురుపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.
