తమపై ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు. వారిని ఎవరో ప్రభావితం చేస్తున్నారని, వేరే శక్తులు ఉపాధ్యాయుల ఆందోళనలో ఉన్నారనే   అనుమానాలు ఉన్నాయని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. 

పిఆర్సి సాధన సమితి (prc steering committee) కృషి వల్లే హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామన్నారు ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిఆర్సి (prc) ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు అయ్యేలా చూశామన్నారు. అదనపు పెన్షన్...సిసిఏ వచ్చిందని, కొందరు తమతో ప్రతి అంశంలో చర్చలో ఉన్నారని వెంకట్రామిరెడ్డి అన్నారు. అప్పుడే వాళ్ళు చర్చ నుంచి బయటకు రావాల్సిందని.. ఫిట్మెంట్ ఒక్కటే ప్రధానం అనుకున్నప్పుడు అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సిందని ఆయన హితవు పలికారు.

సమ్మె అపుదాము అన్నా కూడా ఒకే చెప్పారని.. వారిని ఎవరో ప్రభావితం చేస్తున్నారని, వేరే శక్తులు ఉపాధ్యాయుల ఆందోళనలో ఉన్నారనే అనుమానాలు ఉన్నాయని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఉద్యమంలో ఉన్నప్పుడు అన్ని భరించాలని.. లేకపోతే నాయకులు అనిపించుకోరని ఆయన హితవు పలికారు. ఉద్యోగులు వాట్సాప్ సందేశాలు ఎవరికి పంపద్దని .. మంచి చెడూ ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.

మరో ఉద్యోగ నేత సూర్యనారాయణ (suryanarayana) మాట్లాడుతూ.. గొప్ప పిఆర్సి అని ప్రభుత్వం కానీ, తాము కానీ చెప్పడం లేదన్నారు. తాము పిఆర్సి సాధన సమితి పేరుతో గొప్ప పిఆర్సి సాధించామని చెప్పడం లేదని.. ఉన్నంతలో మంచి ఫలితాలు వచ్చాయి అని సూర్యనారాయణ వెల్లడించారు. 27 శాతం ఫిట్మెంట్ ఇస్తే మంచిది అని చాలా సార్లు సీఎంకు చెప్పామని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాలపై చేసిన దుష్ప్రచారానికి ధన్యవాదాలంటూ సూర్యనారాయణ దుయ్యబట్టారు. బాధ్యత కలిగిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవ్వరు ఇలా చెయ్యరని.. ప్రజాస్వామ్యం లో నచ్చని నిర్ణయానికి నిరసన తెలపడానికి మార్గాలున్నాయన్నారు. 

వచ్చినవి మా వల్లే వచ్చాయని.. రాకపోవడానికి ఆ నలుగురు కారణం అని చెప్పడం విచిత్రంగా ఉందని సూర్యనారాయణ దుయ్యబట్టారు. మా మా వల్ల నాలుగు ఓట్లు వస్తాయంటే సంతోషమేనని.. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసుకోవచ్చునని, కానీ వాస్తవాలు మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఉద్యోగ ఉపాధ్యాయ ప్రయోజనం కన్నా ఇంకా వేరే ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారని సూర్యనారాయణ ఆరోపించారు. వారు చర్చల వల్ల అసంతృప్తి కలిగితే సమ్మెకు వెల్లచ్చు కదా అని నిలదీశారు .. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాల్సిందని, కానీ వేరే ఉద్దేశం ఉందని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు విషయంలో స్పష్టంగా ఒక టైం లైన్ ప్రభుత్వం ప్రకటించిందని సూర్యనారాయణ చెప్పారు. 

బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateshwarlu) మాట్లాడుతూ.. తాము పారదర్శకంగానే చర్చలు జరిపామని తెలిపారు. చర్చలో ప్రతి అంశంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం అయ్యారని బొప్పరాజు గుర్తుచేశారు. మంత్రుల దగ్గర కూర్చుని ఉపాధ్యాయులు ప్రతి అంశం చర్చించారని ఆయన తెలిపారు. అవసరమైతే సీఎంకు అప్పీల్ చెయ్యాల్సిందిగా బొప్పరాజు కోరారు. ఎవ్వరు వ్యతిరేకించని విషయంలో మీకు ఎందుకు ఒత్తిడి వచ్చిందని.. అటెండన్స్‌లో సంతకం తీసుకుని మినిట్స్‌లో సంతకం తీసుకోలేదు అంటే మనపై ఉన్న నమ్మకం ఏంటని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉపాధ్యాయులుపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారో చెప్పాలని.. అన్నింటికి ఒప్పుకుని బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.