ఏపీ పీఆర్సీ విషయంలో ఇటీవల జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలతో తమకు ఎలాంటి న్యాయం జరగలేేదని... కాబట్టి తమ సమస్యలపై మీరే స్వయంగా దృష్టిపెట్టాలంటూ సీఎం జగన్ కు హైకోర్టు ఉద్యోగ సంఘం లేఖ రాసింది.
అమరావతి: అపరిపక్వ చర్చలు జరిపిన పీఆర్సి సాధన సమితి (PRC Sadhana Samithi) ఉద్యోగుల సమస్యలపై పూర్తి పరిష్కారం చూపకుండానే ఉద్యమాన్ని నీరుగార్చిందని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి ఉద్యోగుల వేదనను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy) మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని కోరారు. పరిష్కారం కాని ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ కు హైకోర్టు (ap high court) ఉద్యోగుల సంఘం లేఖ రాసింది.
''ఉద్యోగుల ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగ సంఘాల నాయకులు విఫలం అయ్యారు. కాబట్టి ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై పునరాలోచించి ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై దృష్టి పెట్టండి. గత పీఆర్సీలోని లోటుపాట్లను గుర్తించి మరింత మెరుగైన పీఆర్సీ ప్రకటించాలి'' అని హైకోర్టు ఉద్యోగుల సంఘం తరపున సీఎం జగన్ కు రాసిన లేఖలో అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు.
''అశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీ రిపోర్టును పూర్తిగా పక్కనపెట్టి కేవలం మంత్రుల ఉపసంఘం నిర్దేశించిన మేరకే ఫిట్ మెంట్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో వేల ఉద్యోగుల గుండెల్లో రగిలిన వ్యధనుండే పీఆర్సీ సాధన సమితి ఏర్పాటయ్యింది. కానీ సాధన సమితి మొదటి డిమాండే అశుతోష్ మిశ్రా కమిటీ (ashutosh mishra committee) రిపోర్ట్ ప్రకారమే ఫిట్ మెంట్ ప్రకటించాలని... దీన్నే ఇటీవల జరిగిన చర్చలో పూర్తిగా పక్కనపెట్టారు'' అంటూ ఉద్యోగ సంఘాలపై హైకోర్టు ఉద్యోగ సఘం మండిపడింది.
''HRA స్లాబ్ మార్పుతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కాబట్టి గతంలో మాదిరిగానే హెచ్చాఏ ను కొనసాగించాలి. ఇక ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువగా ప్రకటించడం ఇదే తొలిసారి. మీ అంకెల గారడీ వల్ల సగటు ఉద్యోగి పడుతున్న మానసిన వేదన వర్ణణాతీతం. అపరిపక్వత చర్చల తర్వాత రికవరీ లేదంటూనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుండి తీసుకుంటామనడం ఎంతవరకు సమంజసం'' అని ప్రశ్నించారు.
''క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, సీపీఎస్ రద్దు,కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పిటిడి ఉద్యోగుల అంశాలపై స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో ఉద్యోగ సంఘాల నాయకులు విఫలమయ్యారు. కావున మీరే స్వయంగా మా సమస్యలపై దృష్టిపెట్టి మరింత మెరుగైన పీఆర్సీ ప్రకటించాలి. ఇలా చేయడంద్వారా మీరు ఉద్యోగులకు ప్రియతమ ముఖ్యమంత్రి కాగలరని ఆశిస్తున్నాము'' అని హైకోర్టు ఉద్యోగుల సంఘం సీఎంకు రాసిన లేఖలో పేర్కొంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి కుదుర్చుకొన్న ఒప్పందం విషయంలో ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ సాధన సమితిలో తమ పదవులకు ఏపీటీఎఫ్, యూటీఎఫ్ నేతలు రాజీనామాలు చేసారు.
కొత్త పీఆర్సీ జీవోలను నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 4, 5 తేదీల్లో ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో పీఆర్సీ సాధన సమితి సమ్మెను విరమిస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా హైకోర్టు ఉద్యోగులు కూడా పీఆర్సీ సాధన సమితి తీరును తప్పుబట్టారు.
