టిడిపి నాయకులకు హైదరాబాద్ అంత సేఫ్ కాదా... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి వేధింపులు భరించలేక హైదరాబాద్ లో వుంటున్న ప్రతిపక్ష నాయకులకు అక్కడా రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేసారు.
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వ వేధింపులు భరించలేకపోతున్నామంటూ చాలామంది టిడిపి నాయకులు హైదరాబాద్ లో వుంటున్నారు. అయితే ప్రతిపక్ష నాయకులకు హైదరాబాద్ కూడా అంత సేఫ్ కాదనేలా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలోనే కాదు హైదరాబాద్ లో వుండే టిడిపి నేతలపైనా వైసిపి ప్రభత్వం నిఘా పెట్టిందని మాజీ మంత్రి తెలిపారు. విపక్ష నాయకుల అడ్డు తొలగించుకునేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని పుల్లారావు అనుమానం వ్యక్తం చేసారు.
తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారి రాజేష్ ను చంపేందుకు జగన్ సర్కార్ కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. వైసిపి నాయకులకు ఓటమి భయం పట్టుకుందని... అందువల్లే టిడిపి నాయకుల అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులనే ప్రతిపక్ష నాయకులపై కుట్రలకు ప్రభుత్వం ఉపయోగిస్తోందని అన్నారు. టిడిపి నేత కిలారి రాజేష్ ప్రాణాలకు ముప్పు పొంచివుందని... హైదరాబాద్ లో వున్నప్పటికీ ఆయనకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
టిడిపి నాయకులపై కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో ఇప్పటికే వైసిపి ప్రభుత్వం నిఘా పెట్టిందని పుల్లారావు ఆరోపించారు. పోలీసుల నుండి టిడిపి నాయకుల వివరాలు సేకరించి వాటిని కిరాయి రౌడీ మూకలకు అందిస్తున్నారని తెలిపారు. ఇలా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సంబంధాలున్నట్లు ఆరోపిస్తున్న రాజేష్ ను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. పోలీసులతో పాటు మరికొందరు కూడా హైదరాబాద్ లో వున్న రాజేష్ వెంబడిస్తున్నారని... ఎక్కడెక్కడికి వెళుతున్నాడో ఫోటోలు తీస్తున్నారని తెలిపారు. రాజేష్ వెంటపడుతున్న ముగ్గురు వ్యక్తులు ఎవరు? వైసిపి నాయకులు ఏర్పాటుచేసిన రౌడీలేనా? అని పుల్లారావు అనుమానం వ్యక్తం చేసారు.
Read More ఆధారాలను సీఐడీకి ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయండి:పురంధేశ్వరికి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్
కేవలం రాజేష్ పైనే కాదు విశాఖపట్నం, విజయవాడ చివరకు హైదరాబాద్ లో వుంటున్న టిడిపి నాయకులపై నిఘా పెట్టారని మాజీ మంత్రి తెలిపారు. కాబట్టి రాష్ట్రంలో ఏ ఒక్క టిడిపి నాయకుడికి ఎలాంటి హాని జరిగినా అందుకు వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. పోలీసులు కూడా సీఎం జగన్ కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించకుండా ప్రతిపక్ష నేతలకు రక్షణ కల్పించాలని సూచించారు. ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న కిలారి రాజేష్ కు టిడిపి అండగా వుంటుందని మాజీ మంత్రి పుల్లారావు వెల్లడించారు.