పవన్ కల్యాణ్! ముంచేసే ప్రమాదం, జాగ్రత్త సుమా!!: ప్రకాశ్ రాజ్

Prakash Raj gives suggestion to Pawan Kalyan
Highlights

రాజకీయాల్లో సత్తా చాటడానికి సిద్ధపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సలహా ఇచ్చారు.

హైదరాబాద్: రాజకీయాల్లో సత్తా చాటడానికి సిద్ధపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సలహా ఇచ్చారు. వలస నేతలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన పవన్ కల్యాణ్ కు చెప్పారు. జనాలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పవన్ పార్టీ పెట్టారని, పేరు కోసం పెట్టలేదని అన్నారు.

కావాల్సినంత ప్రజాదరణ, డబ్బు పవన్ కు ఉన్నాయని ఆయన అన్నారు. తన ఆలోచనాపరంగా ఎంత మంది వచ్చి చేరుతారనే విషయంపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ముంచేసే ప్రమాదం కూడా ఉందని అన్నారు. 

పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా ఉంటారని, పవన్ కల్యాణ్ ప్రయత్నం మంచిదేనని అన్నారు. తాను పవన్ కల్యాణ్ మాదిరిగా తాను పార్టీ పెట్టి రాజకీయం చేయలేనని, మంచి చేయాలని వస్తున్న పవన్ కల్యామ్ ను ఆహ్వానిద్దామని అన్నారు. మంచి చేసే వాళ్లకు ఎవరికీ పోటీ కాదని అన్నారు. ఓ న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ ఆయన ఆ విధంగా అన్నారు. 

తన తత్వం వల్లనే బాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయని అన్నారు. యాడ్స్ రావడం లేదని అన్నారు. యూపి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్ముకోలేమని తనకు కార్ల కంపెనీల వాళ్లే స్వయంగా చెప్పారని అన్నారు. 

చంద్రబాబు నిస్సహాయంగా ఉన్నారు....

ఆంధ్రులకు ఘోరమైన అన్యాయం జరిగిందని, హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ మాట తప్పారని ఆయన అన్నారు. కేంద్రం నుంచి సాయం అందక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిస్సహాయంగా ఉన్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. 

జీరోగా ఉన్న రాష్ట్రానికి ఏదో ఒకటి చేయడానికి చంద్రబాబు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. ఈ స్థితిలో చంద్రబాబును ఏమీ అనలేమని అన్నారు. ఆంధ్రులు అడుక్కోవడం లేదని, ప్రత్యేక హోదా వారి హక్కు అని అన్నారు. 

కేసిఆర్ బయోపిక్ చేయటం లేదు...

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ రైతు అభిలాషి అని, మట్టి మనిషి అని కొనియాడారు. చెరువుల పరిరక్షణ, హరితహారం వంటి పథకాలు ఎంతో ఆకర్షిస్తున్నాయని అన్నారు. తను కేసీఆర్ బయోపిక్ లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 

పంచాయతీరాజ్ బిల్లుపై మాట్లాడడానికే తాను కేసిఆర్ ను కలిశానని, వేరే విషయం ఏదీ లేదని అన్నారు. తానంటే కేసిఆర్ కు అభిమానమని, కేసిఆర్ తనకు అభిమానమని అన్నారు. 

loader