Asianet News TeluguAsianet News Telugu

అయ్యా కేసీఆర్... మా సీఎం చేతగానివాడు... కానీ మీ హోదాకిది తగదు: టిడిపి ఎమ్మెల్యేల వినతి

వెలుగొండ ప్రాజెక్టుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్రానికి ఫిర్యాదు చేయడం మీ హోదాకు తగదని తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్ కు టిడిపి ఎమ్మెల్యేలు వినతి చేశారు. 

prakasam district tdp mlas request to telangana cm kcr over velugonda project
Author
Amaravati, First Published Aug 29, 2021, 12:51 PM IST

ప్రకాశం: ఆంధ్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతకానితనంవల్లే వెలుగొండ ప్రాజెక్టుకు అనుమతులున్నా కేంద్ర గెజిట్ లో ఆ ప్రాజెక్టుని చేర్చకపోయారని ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు... దయచేసి ఈ ప్రాజెక్టు అక్రమమంటూ  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్రానికి ఫిర్యాదు చేసి ప్రకాశం జిల్లా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయకండి అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోరారు. 

టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం కేసీఆర్ వినతిపత్రం యధావిధిగా:    


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి..!  

"వెలుగొండ ప్రాజెక్టు"పై మీ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదుని పునః పరిశీలించి, ఉపసంహరించుకోవాలని కోరుతూ... ప్రకాశం జిల్లా రైతాంగం, ప్రజల పక్షాన జిల్లా ప్రజాపతినిధుల (గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి) వినతి..! 

అయ్యా...! 

వెలుగొండ ప్రాజెక్టుకి అనుమతులు లేవని.. ఈ ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తున్నారని మీ ప్రభుత్వం ఈ నెల 23 న కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకి లేఖ రాసింది. మరలా ఈ రోజు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మీ ప్రభుత్వానికి ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం.. వెలుగొండ ప్రాజెక్టుకి అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తుంది..!? కేంద్ర గెజిట్ లో ఆ ప్రాజెక్టుని చేర్చకపోవడం ముమ్మాటికీ మా ప్రభుత్వ వైఫల్యమే తప్ప.. ఆ ప్రాజెక్టు అనుమతులు లేనట్టు కాదు. 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపి, అనుమతులిస్తే అందులో మీ కల్వకుర్తి, నెట్టెంపాడుతో సహా వెలుగొండ కూడా ఉన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలోనే గుర్తు చేసి, కేంద్ర గెజిట్ లో చేర్చమని లేఖ ద్వారా కోరినప్పటికీ నిర్లక్ష్యం వహించారు. "2014 పునర్విభజన చట్టం ప్రకారం చూసుకుంటే కేంద్రమే వెలుగొండకు అనుమతులిచ్చి, మీ కల్వకుర్తి, నెట్టెంపాడుతో సహా పూర్తి చేసుకోమని చెప్పి.. ఇప్పుడు గెజిట్ లో స్థానం ఇవ్వకపోవడం ఆ ప్రాజెక్టు తప్పా..? మా జిల్లా రైతుల తప్పా..? మా కరువు పీడిత ప్రజల తప్పా..!? ముమ్మాటికీ అది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యమే/ మా రాష్ట్ర  ముఖ్యమంత్రి చేతగానితనమే. దానికి మూల్యంగా మీ ప్రభుత్వం ఈరోజు "వెలుగొండకి కేంద్ర గెజిట్ లో స్థానం లేదు" అనే విషయాన్నీ కేంద్రానికి చేసిన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తప్పిదాలను సాకుగా చూపించి తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ఫిర్యాదులు చేయడం మీ హోదాకి తగదు. మా జిల్లాను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని ప్రకాశం జిల్లా రైతులు, ప్రజానీకం తరపున కోరుతున్నాం.

మా జిల్లాలో దయనీయ పరిస్థితులు..! 

దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా ముందు వరుసలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కరువు పీడిత జిల్లా ప్రకాశం. గడిచిన రెండు దశాబ్దాల్లో కేవలం నాలుగేళ్లలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయింది. ఏళ్ల తరబడి కరువు ఫలితంగా జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల సాగుభూమి పూర్తిగా బీడువారి, నమ్ముకున్న భూములను అమ్ముకుని, కూలీలుగా మారారు. కూలీ పని కూడా దొరక్క ఖాళీ కడుపుతో వలసలు పోతున్నారు. కొందరు అప్పులతో ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు.. ఇప్పుడు "ఈ కన్నీటి గాధలన్నీ మీకు ఎందుకు చెప్పుకుంటున్నాము..!?" అనే అనుమానాలు రావచ్చు.. మా జిల్లా దయనీయ స్థితిని మార్చే.., కరువుని తీర్చే ఏకైక పరిష్కారం వెలుగొండ ప్రాజెక్టు. మా జిల్లాలో సాగు, తాగునీటికి ఉన్న ఏకైక భరోసా ఈ ప్రాజెక్టు. కొన్నేళ్లుగా లక్షలాది బతుకులు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని కలలు కంటున్నాయి. ఆ కలలు ఫలించి, ప్రాజెక్టు దాదాపు చివరి దశకు చేర్చుకుంది. ఈ దశలో ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుకి ముప్పు ఏర్పడుతుంది. దాన్నే మీరు సాకుగా చూసుకుని అర్ధం లేని వాదన/ ఫిర్యాదుతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకి లేఖ రాయడం.., ఈరోజు కేంద్రానికి ఫిర్యాదు చేయడం వెనుక మీ అంతరంగమేమిటో..? మా కరువు జిల్లాపై కక్ష ఎందుకో..? అర్ధం కావడం లేదు. 

మా చేతగాని ప్రభుత్వ తప్పిదాన్ని సాకుగా తీసుకుంటారా..!?  

"వెలుగొండ ప్రాజెక్టు"కి అసలు అనుమతులు లేవని.., ఆ ప్రాజెక్టు పరిధిని అక్రమంగా పెంచుతున్నారని.., ఈ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని" కోరుతూ మీ ప్రభుత్వ లేఖ, నేటి ఫిర్యాదుతో వెలుగొండ ప్రాజెక్టుకి మీ ప్రభుత్వం అడ్డుతగులుతున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ ఫిర్యాదులు, లేఖలతో మా జిల్లా రైతులు, ప్రజానీకంలో కలవరం మొదలయింది. అయ్యా... "వెలుగొండ ప్రాజెక్టు ఈ నాటిది కాదు.. 1996 న శంఖుస్థాపన చేశారు.. 2005 నుండి పనులు మొదలు పెట్టారు. 2014లో తెలుగునేలని ముక్కలు చేసిన సందర్భంలో కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఈ చట్టం ప్రకారం చూసుకుంటే ఏపీ, తెలంగాణాలో కలిపి ఆరు ప్రాజెక్టులు (నెట్టంపాడు, కల్వకుర్తి (తెలంగాణ), తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ) యధాతథంగా పూర్తి చేసుకోవాలని కేంద్రం అనుమతులిచ్చింది. పునర్విభజన చట్టంలోని 11 వ షెడ్యూల్, సెక్షన్ 85 (7ఈ)లో నీటి ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంపై స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తున్నట్టు "వెలుగొండకు అనుమతులు లేవు, అక్రమ ప్రాజెక్టు" అంటే... మీరు కట్టుకున్న నెట్టెంపాడు, కల్వకుర్తిలకు కూడా అనుమతులు లేనట్టేనా..!? అవి కూడా అక్రమ ప్రాజెక్టులేనా..!? పునర్విభజన చట్టం ప్రకారం మీ ప్రాజెక్టులకు ఎన్ని హక్కులు, అనుమతులు ఉన్నాయో.., మా వెలుగొండకు కూడా అన్ని హక్కులు, అనుమతులు ఉన్నాయి. కేవలం ఆంధ్ర ప్రదేశ్ దద్దమ్మ ప్రభుత్వం మొద్దు నిద్ర వలన మాత్రమే ఈ అవస్థ వచ్చింది. దానిని మీరు ఒక కారణంగా  చూపించి కరువు జిల్లా కడుపు కొట్టాలనుకోవడం ఎంత వరకు సమంజసం..? మా వంటి కరువు పీడితే జిల్లా ప్రాజెక్టుపై ఇటువంటి అర్ధం లేని ఫిర్యాదులు మీ హోదాకి, మీ స్థాయికి తగునా..!? మా ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పులే ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. గత నెలలో కేంద్రం గెజిట్ ప్రకటించిన వెంటనే మేలుకుని వెలుగొండని కేంద్ర గెజిట్ లో చేర్చేలా ప్రయత్నాలు చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ ప్రభుత్వం ఇంత వరకు ఫిర్యాదు చేసేది కాదేమో. మా జిల్లా పరిస్థితులు, విభజనచట్టం ప్రకారం వెలుగొండ హక్కులు, అనుమతులు పరిశీలించి మీ లేఖని, ఫిర్యాదుని ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నాం.


      

 

Follow Us:
Download App:
  • android
  • ios