ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ నిప్పులు చెరిగారు. ఇద్దరు సీఎంలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి తాను గొప్ప అంటే తాను గొప్ప అంటూ తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. 

థర్డ్ ఫ్రంట్ లోని పెద్ద నాయకులు తనను ప్రత్యేకంగా కలుస్తున్నారని కేఏపాల్ స్పష్టం చేశారు. సేవ్ సెక్యులర్ ఇండియా అనే నినాదమే తమ పార్టీ నినాదమంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఊహాతీతంగా ఉందన్నారు. 

అన్ని రంగాల్లో తామే నెంబర్ వన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తున్నారని ఎందులో నెంబర్ వన్ అని ప్రశ్నించారు. క్రైమ్ లో నెంబర్ వన్ స్థానం సాధించారని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.  

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ కరువయిందని ఆరోపించారు. ఏపీలో రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, ప్రజలకు సరైన ఆహారం అందుబాటులో లేదన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో శాంతి ఎక్కడుందని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని, ప్రజలు ఏ రంగంలోనూ లాభపడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

డిసెంబర్‌ 29న విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ ఆఫీసుని ప్రారంభిస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీలో చేరుదామని ఉత్సాహం ఉన్న వాళ్లు వైజాగ్‌ రావాలని పిలుపునిచ్చారు. 13 జిల్లాల్లో బూత్‌ లెవెల్‌ కమిటీ చర్చ జరుగుతుందని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, మిగిలిన పార్టీలు కుటుంబ పార్టీలు, కుల పార్టీలు అంటూ విమర్శలు చేశారు.