బాంబు పేల్చిన అనంతపురం ఎంఎల్ఏ

First Published 30, Nov 2017, 1:12 PM IST
prabhaar says majority leaders opposing ycp leader joining in to tdp
Highlights
  • అనంతపురం టిడిపి రాజకీయం రసకందాయంలో పడింది.

అనంతపురం రాజకీయం రసకందాయంలో పడింది. వైసిపి నేత గుర్నాధరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలన్న చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని జిల్లాలోని టిడిపి నేతల్లో ఎక్కువమంది వ్యతిరేకిస్తున్నట్లు ప్రభాకర చౌదరి చెప్పారు. అనంతపురం మాజీ ఎంఎల్ఏ, వైసిపి నేత గుర్నాధరెడ్డి టిడిపిలో చేరుతున్న సమయంలో సిట్టింగ్ ఎంఎల్ఏ ప్రభాకర చౌదరి పెద్ద బాంబే పేల్చినట్లైంది. ఇంతకీ ఏం జరిగిందంటే, గుర్నాధరెడ్డి సోదరులను చంద్రబాబు టిడిపిలోకి చేర్చుకుంటున్నారు. అమరావతిలో చేరికకు బహుశా గురువారమే ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లుంది. అయితే, మాజీ ఎంఎల్ఏ టిడిపిలో చేరటాన్ని చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసిపి నేత టిడిపిలో చేరితే వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్టు దక్కే విషయమై ప్రభాకర్ ఆందోళనలో ఉన్నారు. అయితే చౌదరి ఆందోళనను లెక్క చేయకుండా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

ఇటువంటి సమయంలో అసెంబ్లీ లాబీల్లో ఈరోజు ప్రభాకర్ మాట్లాడుతూ, గుర్నాధరెడ్డి చరిత్రంతా హత్యలు, కబ్జాలేనంటూ విరుచుకుపడ్డారు. అక్రమ సంపాదనను సక్రమం చేసుకునేందుకే టిడిపిలోకి వస్తున్నట్లు మండిపడ్డారు. వైసిపి నేత అక్రమాలపై ఇంతకాలం పోరాటాలు చేసిన తాము ఇక ఎవరిపై పోరాటాలు చేయాలంటూ పాపం చౌదరి బాధడిపోయారు.  అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి తప్ప వైసిపి నేత టిడిపిలో చేరటాన్ని ఎవరూ స్వాగతించటం లేదని కూడా చెప్పేసారు. అంటే అర్ధమేంటి? గుర్నాధరెడ్డి చేరికను అందరూ వ్యతిరేకిస్తున్నారనే కదా? గుర్నాధరెడ్డితో కలిసి ఫొటో దిగటానికి కూడా తాను ఇష్టపడనని ప్రభాకర్ చౌదరి తేల్చి చెప్పేసారు. చౌదరి వరస చూస్తుంటే అనంతపురం రాజకీయాలు మంచి రసకందాయంలో పడేట్లే ఉన్నాయి.

 

loader