ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) షాక్ ఇచ్చింది. ఏపీకి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. దీంతో రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కరెంట్ కోతలు కొనసాగాయి. 

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) షాక్ ఇచ్చింది. ఏపీకి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఎన్టీపీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఎన్టీపీసీ నిలిపివేసింది. ఎన్టీపీసీకి రాష్ట్ర డిస్కంలు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటికోసం లేఖలు రాసినప్పటికీ.. డిస్కంల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యుత్‌ను నిలిపేసినట్లు ఎన్టీపీసీ వర్గాలు తెలిపాయి.

ఇక, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్‌ను ఏపీలో డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు సుమారు రూ.350 కోట్లను డిస్కంలు బకాయి పడ్డాయి. అవి చెల్లించకోవడంతో ఎన్టీసీపీ అధికారులు సరఫరాను నిలిపివేశారు. అంతేకాకుండా ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారమయ్యే వరకూ బహిరంగ మార్కెట్‌లో కొనేందుకూ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు అవకాశం లేకుండా బ్లాక్‌ చేశారు. అందుకే ఏపీలో డిస్కంలు రెండు రోజులుగా కోతలు విధించాయి. ఒక్కసారిగా పడిపోయిన విద్యుదుత్పత్తితో రాష్ట్రంలో సరఫరాకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. 

ఏపీలో వరుసగా రెండో రోజు కరెంట్ కోతలు.. 
ఏపీలో వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా విద్యుత్‌ అంతరాయం కొనసాగింది. పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తరచుగా అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా కరెంట్ కోతలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల శుక్రవారం రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

రాయలసీమ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలు, నెల్లూరు, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. శుక్రవారం దాదాపు 200లకు పైగా సబ్‌ స్టేషన్లలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. విద్యుత్ అంతరాయాలు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక వినియోగదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. 

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌తో (VTPS) సహా రాష్ట్రంలోని కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్‌లలో విద్యుత్ ఉత్పత్తి సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిదిద్దడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇంధన శాఖ సీనియర్ అధికారులు చెప్పారు.

విద్యుత్ లోటు నేపథ్యంలో విద్యుత్ లోటును ఆర్టీపీసీ ద్వారా భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరో యూనిట్‌ను ప్రారంభించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సరిపడా బొగ్గు నిల్వలు లేవని సమాచారం.