ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 

ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో మాజీ ఎమ్మెల్యే పోతుల సునీత సోమవారం భేటీ అయ్యారు.  ఈ క్రమంలో పోతుల సునీతకు సీఎం జగన్ బీఫామ్ అందజేశారు. ఇటీవలే ఆమె పదవికి రాజీనామా చేయగా.. ఆ సీటు మళ్లీ ఆమెకే కేటాయించారు.

ఈ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఈ ఎన్నిక జరగనుంది..ఈ ఖాళీ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది.. జనవరి 11న నోటిఫికేషన్ విడుదలకానుంది. నామినేషన్లు పరిశీలన జనవరి18 .. నామినేషన్ పరిశీలన జనవరి 19న .. జనవరి 28న పోలింగ్.. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది.

పోతుల సునీత శాసన మండలి సభ్యత్వానికి గత నెలలో రాజీనామా చేసి, లేఖను చైర్మన్‌కు పంపించారు. టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు. తన ఈ రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు.. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఆమోదించారు. 

పోతుల సునీత గతంలో టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దీంతో అక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. ఆ వెంటనే చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైఎస్సార్‌సీపీలో చేరగా.. ఆమె మాత్రం టీడీపీలో కొనసాగారు. కానీ కొద్దిరోజుల తర్వాత అనూహ్యంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో టీడీపీ అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేయగా.. విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీత తన పదవికి రాజీనామా చేశారు. జగన్ ఆమెకు మళ్లీ అవకాశం ఇచ్చారు.