విజయవాడలో దారుణం: యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ స్నేహితులు

Polytechnic student gangraped in Vijayawada
Highlights

పాలిటెక్నిక్ విద్యార్ధినిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్నేహితులే ఆమెను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


విజయవాడ:విజయవాడలోని ఉడా కాలనీలో ఓ యువతికి మత్తు మందిచ్చి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.స్నేహితులే ఈ దారుణానికి పాల్పడ్డారని  పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. 

 ఓ యువతిని కొందరు స్నేహితులు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆపై మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు, సంఘటనా స్థలంలో అచేతనంగా యువతి పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

 బాధితురాలిని చికిత్స నిమిత్తంపోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స సమయంలో యువతి అపస్మారక స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోలుకోగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 

సంఘటన ప్రదేశంలో దొరికిన బైక్ ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

అయితే  ఆ యువతి ఎవరు, ఆమెను  తీసుకెళ్లిన నిందితులకు ఎప్పటి నుండి సంబంధాలున్నాయి,  ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధిత యువతితో కలిసి నలుగురు యువకులు పాలిటెక్నిక్ చదివినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నిందితులు చెప్పిన మాయమాటలు నమ్మి బాధితురాలు  వారితో కలిసి వెళ్లిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
 

loader