నెల్లూరు : ఏపీలో చలిచంపేస్తున్నా రాజకీయ వేడి మాత్రం పొగలు సెగలు కక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాల్ ప్రతి సవాల్ తో అప్పుడే ఎన్నికల వేడిని తలపిస్తోంది. 

తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య సవాల్  నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా డేగపూడి-బండేపల్లి కాలువ పూర్తి చేసి నీళ్ళు విడుదల చేస్తే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మంత్రి సోమిరెడ్డికి సవాల్‌ విసిరారు.  

వీరంపల్లి గ్రామంలోని కండలేరు వద్ద పారుతున్న సాగునీటిని పరిశీలించిన కాకాని స్థానిక రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రైతులకు సాగునీరందించి పంటలు పండించేలా సహకరించాలని కోరారు. ఎక్కడైనా సెంటు పొలం ఎండినా దానికి నీటిపారుదల అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  
 
ఎన్నికల్లోగా కాలువ పూర్తికాకపోతే జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా తాను కాలువపూర్తి చేస్తానని అలా చేయకపోతే 2024 ఎన్నికల్లో సర్వేపల్లి ప్రజలను ఓట్లు అడగనన్నారు. తాను ఇచ్చిన మాట తప్పే వ్యక్తిని కాదన్నారు. మంత్రి సర్వేపల్లిలో చేసిందేమీ లేదని కేవలం పేపర్లకే పరిమితం అంటూ విమర్శించారు.