కడప: మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రంగం మీదికి వచ్చారు. భూమా అఖిలప్రియను రాజకీయంగా ఎదుర్కోవడానికి జస్వంతి సిద్ధపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏవీ సుబ్బారెడ్డికి, అఖిలప్రియకు మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. 

తాజాగా, జస్వంతి వివిధ మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియపై పోటీకి తాను సిద్ధమని జస్వంతి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు. అదే విధంగా తాను తప్పకుండా ఆళ్లగడ్డ వెళ్తానని ఆమె ఎన్టీవీతో చెప్పారు. తనకు ఏమైనా జరిగితే అఖిలప్రియదే బాధ్యత అనే విషయాన్ని తాము పోలీసులకు చెప్పినట్లు ఆమె తెలిపారు. 

Also Read: నా హత్యకు సుపారీ, అఖిలప్రియను అరెస్టు చేయాల్సిందే: ఏవీ సుబ్బారెడ్డి

తాజా పరిణామాలను గమనిస్తే వచ్చే ఎన్నికల నాటికి అఖిలప్రియపై ఆళ్లగడ్డలో పోటీకి జస్వంతి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె మాట్లాడుతున్న తీరు కూడా ఆ విషయాన్నే తెలియజేస్తోంది. తమ అళ్లగడ్డ అని, అక్కడే రాజకీయం చేస్తామని ఆమె అన్నారు. ఆళ్లగడ్డకు వెళ్తే స్వాగతించడానికి ఆమె ఎవరని జస్వంతి ప్రశ్నించారు. 

అఖిలప్రియను అక్కా అని పిలువాలంటేనే అసహ్యం వేస్తోందని ఆమె అన్నారు. దేవుడిచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని ఆమె అన్నారు. తనను చంపడానికి అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీన్నే జస్వంతి ఆ రకంగా చెప్పారు. 

తన తండ్రి ప్రాణం ఖరీదు రూ.50 లక్షలా, అడ్డు వచ్చినవారందరినీ అఖిప్రియ చంపుతుందా అనే జస్వంతి అడిగారు. జస్వంతి వ్యాఖ్యలు చూస్తుంటే అఖిలప్రియను రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది.