కడప: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాను చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వకుండా తనను ఆళ్లగడ్డ రమ్మంటున్నారని ఆయన అన్నారు. తనకు రాజకీయాలు నేర్పుతుందా ఆయన అడిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన హత్యకు సుపారి ఇచ్చిన అఖిలప్రియ దంపతులను అరెస్టు చేయాల్సిందేనని ఆయన అన్నారు. భూమా నాగిరెడ్డి కోసం తాను సీటు వదులుకున్నట్లు తెలిపారు. 

భూమా అఖిలప్రియ, భార్గవ్ దంపతులు తనను చంపడానికి సుపారీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. తన హత్యకు జరిగిన కుట్రలో అఖిప్రియా ముద్దాయా, కాదా అని ఆయన ప్రశ్నించారు. తాను అఖిలప్రియపై ఫిర్యాదుచేయలేదని, పోలీసులు చెప్తేనే తన హత్యకు ప్రయత్నం జరిగిందని తనకు తెలిసిందని ఆయన అన్నారు. 

పోలీసులు చెప్పిన విషయం తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన అన్నారు. తనపై దాడికి ప్రయత్నం జరిగిన తర్వాత రెండు నెలలు మౌనంగా ఉన్నానని ఆయన చెప్పారు. తనకు అఖిప్రయతో ఆర్థిక లావాదేవీలు లేవని ఆయన చెప్పారు. అయితే, తనను రాజకీయంగా హత్య చేయాల్సిన అవసరం ఆమెకు ఎమొచ్చిందని ఆయన అడిగారు. 

అఖిలప్రియకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఊరికే రాలేదని, ఆమె అమ్మానాన్నల వల్లా తన వల్లా వచ్చాయని ఆయన అన్నారు. ప్రత్యర్థులు బాంబుల దాడి చేసినా అఖిప్రియ తండ్రి భూమా నాగిరెడ్డిని తీసుకుని వెళ్లి నామినేషన్ వేయించానని, భూమా నాగిరెడ్డిని తన భుజాల మీద ఎక్కించుకుని వెళ్లి నామినేషన్ వేయించానని ఆయన గుర్తు చేశారు. 

మార్చిలో తన హత్యకు కుట్ర జరిగిందని ఆయన చెప్పారు. అఖిలప్రియ ఆలోచించి మాట్లాడాలని ఆయన అన్నారు. ప్రజల్లోకి వెళ్లి నువ్వు గెలిచావా, ఈ రోజు నన్ను చంపించడానికి ప్రయత్నిస్తావా అని ఏవీ సుబ్బారెడ్డి అఖిలప్రియను ప్రశ్నించారు. అఖిలప్రియ మంత్రిగా విఫలమయ్యారని తాను చెప్పలేదని అన్నారు. అఖిలప్రియను తన కూతురుతో సమానంగా చూశానని, తన కార్యకర్తలను కాపాడుకుంటానని ఆయన చెప్పారు. 

ఇంచార్జీగా ఇస్తే అఖిలప్రియ ఇంకా ఎంతు మందిని చంపిస్తుందో అని ఎవీ సుబ్బా రెడ్డి అన్నారు. ఆమెకు తప్ప ఎవరికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించినా మద్దతు ఇస్తానని ఆయన చెప్పారు.