ప్రభుత్వ వేదికపై ఓ అధికార పార్టీ నేత పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యానించారు. కాగా.. అక్కడే ఉన్న ఓ మహిళా పోలీసు అధికారిణి వెంటనే ఆ విషయంపై స్పందించి.. గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ ఘటన బుధవారం తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ సభలో చోటుచేసుకొంది. మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైసీపీ కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడారు.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాలను దుమ్మెత్తిపోశారు. అక్కడితో ఆగకుండా ‘కుక్కలు’ అంటూ పోలీసులపై నోరు పారేసుకొన్నారు. అయితే, అక్కడే ఉన్న మహిళా సీఐ ధాటిగా సమాధానం చెప్పి, దీటుగా ప్రతిఘటించారు. 

‘‘గత ప్రభుత్వంలో వేగుళ్ల నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించారు. అందుకు పోలీసులు సహకరించారు. టీడీపీ నేతల కోసం కుక్కల్లా పనిచేశారు’’ అని పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండపేట సీఐ మంగాదేవి అదే వేదిక నుంచి ప్రతిస్పందించారు. ఎక్కడో, ఎవరో చేసిన దానికి పోలీసు శాఖలోని అందరినీ తప్పుపట్టడం సరికాదని ఆ నేతను గట్టిగా ప్రతిఘటించారు. దీంతో ఆయన దిగొచ్చి పోలీసులకు క్షమాపణ చెప్పారు.