ఖైదీ నెంబర్ 7691.. రాజమండ్రి జైలుకు చంద్రబాబు..
Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల(సెప్టెంబర్ 22వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆదివారం అర్థరాత్రి ప్రాంతంలో పలు నాటకీయ పరిణామాల నడుమ ఆయనను విజయవాడ నుంచి రాజమండ్రికి రోడ్డు మార్గంలో తరలించారు. అయితే.. దాదాపు ఐదు గంటలకు పైగా సాగిన ప్రయాణంలో ఉద్రిక్తతలు తల్లెత్తడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని, చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు సంబంధిత అధికారులకు ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు.. జైలు అధికారులు చంద్రబాబు కోసం జైల్లోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. అలాగే ఆయనకు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు దగ్గర ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా భారీగా మొత్తంలో పోలీసులు మోహరించారు. చంద్రబాబు వెంటే ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా రాజమండ్రికి వెళ్లారు. అయితే.. భద్రతా కారణాల రీత్యా ఎవర్నీ కూడా జైలు బయటే నిలిపివేశారు.