అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీకి పాల్పడిన నిందితుడి చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. అతని జాడ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అనకాపల్లి జిల్లాలో (anakapalle district) పట్టపగలు బ్యాంకులో జరిగిన దోపిడీ (robbery) ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కసింకోట మండలం నర్సింగపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో (ap grameena vikas bank) చొరబడిన ఓ గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో క్యాషియర్‌ను బెదిరించాడు. అనంతరం అతని వద్ద ఉన్న రూ.3.30 లక్షలు లాక్కొని పారిపోయాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో బ్యాంకు సిబ్బందితో పాటు ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు. అనంతరం తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రగంలోకి దించారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి కస్టమర్‌లా బ్యాంక్‌లోకి ప్రవేశించారు. తన ముఖం ఏ మాత్రం కనిపించకుండా హెల్మెట్ పెట్టుకుని... బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు. దోపిడీ సమయంలో నిందితుడు బ్యాంక్ సిబ్బందిని బెదిరించిన విజువల్స్, పారిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడి ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. అతని ఆచూకి తెలిస్తే సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు.
"
