చిత్తూరు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అలాగే చిత్తూరులో ఆయన దీక్షకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు తిరుపతిలో దీక్షకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు నిరసనకు దిగారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున 144వ సెక్షన్ అమలులో ఉందని వారు చెప్పారు. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉందని అన్నారు. 

పోలీసుల తీరుపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. హౌస్ అరెస్టు చేసిన చిత్తూరు జిల్లా టీడీపీ నేతలను తక్షణమే వదిలేయాలని ఆయన డిమాండ్ చేశారు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కు ప్రతిపక్ష నాయకుడిగా లేదా అని ఆయన అడిగారు. 

వేలాది మందితో కుల సంఘాల సమావేశాలు, ర్యాలీలు, సభలు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు, మంత్రులు చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే అనుమతి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. 

చంద్రబాబు పర్యటనతో మండుటెండలో కూడా వైసీపీ నేతలు, మంత్రులు వణికిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలనుు, అవినీతిని, గుండాగిరిని ప్రజలకు వివరిస్తామని, ప్రభుత్వ పాలనపై విసుగెత్తారని ఆయన అన్నారు. అందుకే ప్రజల తరఫున నిలబడుతున్న నేతలను ఇళ్లలో నిర్బంధిస్తున్నారని ఆయన అన్నారు.