శనివారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి అమరావతిలో సమావేశం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మందడం నుంచి సచివాలయానికి దారిలో నివాసాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

కొత్త వ్యక్తులను ఇళ్లలో వుంచవద్దని, ఒకవేళ ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలిపారు. కేబినెట్ సమావేశం ఉండటంతో ఆ రోజున నిరసనలకు అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Also Read:విశాఖ నుండి అమరావతికే... జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ సమావేశంలో మూడు రాజధానుల గురించి ప్రధానంగా చర్చించి, జీఎన్ రావు కమిటీ నివేదికపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ ప్రజలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే రాజధానిపై కీలక ప్రకటన ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 27 ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగాల్సి వుంది. అయితే ఈ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న దానిపై స్పష్టత రావడం లేదు.

ప్రస్తుత రాజధాని అమరావతిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో మంత్రివర్గ  సమావేశం జరగనుందన్న ప్రచారం జరిగింది. అయితే రెండు రోజుల్లోనే ఈ సమావేశం వుండటంతో ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది.

Also Read:ఏపీకి మూడు రాజధానులు: జై కొట్టిన విశాఖ తమ్ముళ్లు, బాబుకు తీర్మానం

ఈనెల 27న విశాఖలో కాకుండా వెలగపూడిలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కేబినెట్ భేటీకి అమరావతి ప్రాంతంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులకు సీఎస్ నుండి ఆదేశాలు అందాయట.