అనంతపురం విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్... జగన్ పై లోకేష్ సీరియస్ (వీడియో)
అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి తలలు పగలగొట్టడాన్ని ఖండించారు మాజి మంత్రి నారా లోకేష్. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేసారు.
అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని లోకేష్ మండిపడ్డారు.
''గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి'' అని nara lokesh డిమాండ్ చేసారు.
వీడియో
ఈ ఘటనపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్ కూడా సీరియస్ అయ్యారు. anantapur లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జగన్ రెడ్డి లాఠీచార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని... పోలీసులను విద్యార్ధినులపై విచక్షణా రహితంగా దాడి చేయడం హేయమని అన్నారు. విద్యార్దులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బ జగన్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గర పడుతున్న గడియలుగా లెక్కవేసుకోవాలని హెచ్చరించారు.
''ప్రతిపక్షాల మీదకు పోలీసులను ఉసిగొల్పినట్లుగానే విద్యార్థులపైనా ఉసిగొల్పారు. తమ విద్యాసంస్థలను కాపాడుకునేందుకు శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్ధులపై లాఠీలు ఝులిపిస్తున్నారు. ఇప్పటికే జగన్ రెడ్డి తుగ్లక్ విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేశారు. నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం దేశంలోనే 19వ స్థానానికి పడిపోయింది. విద్యార్ధులను, విద్యాలయాలను అడ్డం పెట్టుకొని దోపిడీలకు తెగపడుతున్నారు'' అని మండిపడ్డారు.
''సామాన్యలను మోసం చేసినట్లుగా విద్యార్ధులను మోసం చేస్తే చెల్లదు. ప్రభుత్వాలనే కూలదోసిన చరిత్ర విద్యార్ధులకు ఉంది. జగన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని విద్యార్ధులు తెలుసుకొని ప్రశ్నిస్తున్నారన్న కక్షతో విద్యార్ధులపై దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. విద్యార్ధినులపై దాడులు చేయించిన జగన్ రెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి'' అని డిమాండ్ చేసారు.
''ఎయిడెడ్ భూములను దోచుకోవాలనుకున్న మీ దుర్భుద్దితో 2 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకం కానుంది. ఇప్పటికైనా జగన్ రెడ్డి ఎయిడెడ్ పై తుగ్లక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం'' అని ప్రణవ్ గోపాల్ తెలిపారు.
READ MORE వెనకడుగువేసే ప్రసక్తే లేదు.. ఆధారాలతో మాట్లాడతాను.. టీడీపీ నేత పట్టాబి
ఇదిలావుంటే అనంతపురం SSBN కళాశాల వద్ద పోలీసులు లాఠీ చార్జి చేయలేదని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటించింది. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న విద్యార్థిసంఘాల నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని... దీంతో కొందరు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు పేర్కొన్నారు. దీంతో గాయపడిన ఓ విద్యార్థినిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించామని... స్వల్ప గాయాలైన సదరు విద్యార్థికి ప్రమాదమేమి లేదని డాక్టర్ల వెల్లడించారన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రి ముందు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గించడానికి యత్నించిన విద్యార్థులను మాత్రమే చెదరగొట్టినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.