జన్మభూమిలో టిడిపి నేతలే కొట్టేసుకున్నారు

Police lathi charged in janmabhoomi programme in east Godavari district
Highlights

  • జన్మభూమి కార్యక్రమంలో టిడిపి వర్గాలే కొట్టేసుకుంటున్నాయి.

జన్మభూమి కార్యక్రమంలో టిడిపి వర్గాలే కొట్టేసుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన తాజ ఘటనే అందుకు నిదర్శనం. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో జరుగుతున్న కార్యక్రమం కావటంతో నియోజకవర్గాల్లో నేతలు ఎవరికి వారు తమ బలాబలాలను ప్రదర్శిస్తున్నారు.

 పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గాలున్నాయి. ఈ రెండు వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది. అటువంటిది రెండు గ్రూపులు జన్మభూమి ప్రోగ్రామ్ లో ఒకే చోట చేరాయి.  సభకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.  మాజీ ఎమ్మెల్సీ భాస్కర రామారావు మాట్లాడుతూ  పరోక్షంగా ఎంఎల్ఏ సామాజికవర్గంపై మండిపడ్డారు.

తర్వాత మాట్లాడిన ఎంఎల్ఏ భాస్కరరామారావు లేవనెత్తిన అంశాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ పథకాల వివరిస్తున్నారు. ఇంతలో ఓ  స్థానికుడు లేచి భాస్కరరామారావు అడిగిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు అభివృద్ధి పనులపై మాట్లాడిన అనంతరం సమాధానం చెబుతారని చెప్పారు. అందుకు ఎంఎల్సీ వర్గం ఒప్పుకోలేదు. దాంతో మాట మాట పెరిగి గందరగోళానికి దారి తీసింది.

ఇదే విషయమై మళ్ళీ భాస్కర రామారావు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, నాయకర్‌ మొదలైన వారు ఎవరిష్టం వచ్చినట్లు వారు సాగించుకున్నారంటూ విమర్శించారు.  అంతేకాకుండా గ్రామంలో ఒక అనామకుడ్ని వెంట వేసుకుని పాలన చేస్తున్నారని అన్నారు. దాంతో ‘ఆ అనామకుడు ఎవరం’టూ ఎమ్మెల్యే వర్గీయులు బొడ్డు సతీష్, సత్తిరాజు తిరిగి ప్రశ్నించడంతో గొడవ మొదలై  తోపులాట జరిగింది. దాంతో రెండు గ్రూపులను విడదీయటానికి పోలీసులు వెంటనే లాఠీచార్జి చేసి అక్కడ నుంచి పంపించేశారు.

తర్వాత బొడ్డు మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో వ్యక్తుల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించకుండా తప్పుడు కేసులు పెట్టించి నాయకులను పార్టీకి దూరం చేస్తున్నట్లు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. పెద్ద అవినీతి పరుడిగా తయారైన ఎంఎల్ఏపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని బొడ్డు ధ్వజమెత్తారు.

loader