అధికార పార్టీలొ మంత్రిగా వున్న అఖిల ప్రియ వర్గీయులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టడం ఆళ్లగడ్డలో సంచలనంగా మారింది. ఈ విషయం గురించి తెలుసుకున్న మంత్రి ఓవైపు పోలీసుల తీరుపై సీరియస్ అవతూనే....మరోవైపు నిరసన తెలిపారు.

తన రక్షణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన గన్ మెన్ల వెనక్కి పంపిచడంతో పాటు ఇకనుంచి తనకు పోలీస్ రక్షణ అవసరం లేదంటూ అఖిల ప్రియ నిరసనకు దిగారు. దీంతో ఆళ్ళగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బుధ వారం అర్థరాత్రి పోలీసులు వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల ఇళ్లతో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలు మంత్రి అఖిల ప్రియకు అత్యంత సన్నిహితంగా వుండే నాయకుల ఇళ్లలో కూడా జరిగాయి. దీంతో వారు మంత్రికి పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. 

దీంతో అఖిల ప్రియ స్థానిక పోలీసులకు ఈ వ్యవహారంపై ప్రశ్నించగా...ఉన్నతాధికారుల ఆదేశాలదతోనే ఈ ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన పోలీస్ సెక్యూరిటీని ఉపసహరించుకుని నిరసన తెలిపారు. 

అయితే పోలీసులు అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీలు చేపట్టారని...శాంతి భద్రతల విషయంలో జరిగిన ఈ తనిఖీలను మంత్రి కావాలనే రాజకీయం  చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రి వర్గానికి చెందిన వారే ఎక్కువగా అక్రమాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు భంగం కల్గించడం వల్లే వారినే పోలీసులు టార్గెట్ చేసి వుంటారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి మంత్రి సహకరించడం మంచిదికాదని వైఎస్సార్‌సిపి నాయకులు తెలిపారు.