గత నెలలో  సంక్రాంతి పండగ సమయంలో రాంబాబు, ఆయనతో సన్నిహితంగా ఉన్న మహిళ మరిదికి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో.. గ్రామ పెద్దలు రాంబాబును హెచ్చరించారు. 

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈ నెల 2వ తదీన జీలుగు కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసును తాజాగా పోలీసులు చేధించారు. లో దొడ్డి గ్రామ సచివాలయ వాలంటీరు వంతల రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత.. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడు.

గత నెలలో సంక్రాంతి పండగ సమయంలో రాంబాబు, ఆయనతో సన్నిహితంగా ఉన్న మహిళ మరిదికి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో.. గ్రామ పెద్దలు రాంబాబును హెచ్చరించారు. అప్పటి నుంచి ఆమె తనకు దూరమైందని రాంబాబు అసహనానికి లోనయ్యాడు. ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ నెల 1న రాత్రి అతడి జీలుగు చెట్టు కల్లుముంతలో కలుపు మొక్కల నాశనకారి గడ్డి మందును కలిపాడు. ఎప్పుడూ చెట్టు నుంచి కల్లు దించాక మహిళ భర్తే తాగేవాడు.

ఆ తర్వాత మిగిలిన వారికి పంచేవాడు. ఇదే వ్యూహంతో మహిళ భర్తను అడ్డు తొలగించుకోవాలని రాంబాబు భావించేవాడు. అనూహ్యంగా మహిళ భర్తతో పాటు మరో నలుగురు ఓకేసారి జీలుగు కల్లు తాగారు. మహిళ భర్తను మాత్రమే కడతేర్చాలన్న వ్యూహం బెడిసి కొట్టి ఐదుగురు ప్రాణాలు బలయ్యాయి. కేసును త్వరగా ఛేదించిన ఏఎస్పీ కృష్ణకాంత్, సీసీఎస్ డీఎస్పీ రాంబాబు బృందాలను ఎస్పీ అభినందించారు. ఎక్కడైనా నేరం జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేయవద్దని.. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తే కేసు త్వరగా ఛేదించే వీలుందని ఎస్పీ వ్యాఖ్యానించారు.