టీడీపీ, వైసీసీ వర్గీయుల మధ్య ఘర్షణ: పరిటాల శ్రీరామ్ పై కేసు
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కనగానపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదైంది.
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కనగానపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదైంది. ఈ నెల 26వ తేదీన వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ బస్సు యాత్ర సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 26న చోటు చేసుకుంది.
బాణాసంచా విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ విషయమై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాఫ్తాడు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గతంలో ఇదే స్థానం నుండి రెండు దఫాలు పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. కానీ, గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పరిటాల శ్రీరామ్ , పరిటాల సునీతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల కాలంలో రాఫ్తాడు నియోజకవర్గంలో టీడీపీ బస్సు యాత్ర నిర్వహించింది. ఈ యాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీగా పరిటాల శ్రీరామ్ ను చంద్రబాబునాయుడు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ స్థానం నుండి పరిటాల శ్రీరామ్ టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. గతంలో ఇదే అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన వరదాపురం సూరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. దీంతో ధర్మవరం అసెంబ్లీ స్థానానికి పరిటాల శ్రీరామ్ ను చంద్రబాబు ఇంచార్జీగా నియమించారు.
పరిటాల రవి బతికున్న సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాపై మంచి పట్టుంది. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిటాల రవికి అనుచరులున్నారు. దీంతో పరిటాల శ్రీరామ్ ను ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీగా నియమించింది.
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీగా ఉన్నప్పటికీ రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ పరిటాల శ్రీరామ్ పర్యటిస్తున్నారు. రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ మధ్య సవాళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.