అమరావతి: పోలీసులపై భయంతో ఓ రైతు ప్రాణాలను కోల్పోయిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున తోటి రైతులతో కలిసి పొలానికి వెళుతుండగా పోలీసులు వస్తున్నారన్న భయంతో ఓ రైతు కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  

తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన షేక్ జాఫర్ (60) సాదారణ రైతు. ఉదయాన్నే స్నేహితులతో కలసి చేలోకి వెళుతుండగా పోలీసులు వస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో కొడతారన్న భయంతో జాఫర్ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందాడు. 

తన తండ్రికి గుండె జబ్బు ఉందని... పోలీసుల భయంతోనే చనిపోయాడని మృతుడి కుమారుడు సద్దాం హుసేన్ తెలిపారు. ఈ ఘటన రైతు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అతడి మృతిపట్ల తోటి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లాక్ డౌన్ కారణంగా పోలీసులు నిత్యం వస్తుండటంతో గ్రామాల్లో భయాందోళనలు రేకెత్తాయి. వారికి భయపడి ప్రజలెవ్వరూ ఇండ్ల నుండి బయటకు రావడం లేదు. ఏదయిన పనిపై వచ్చినవారు కూడా భయంభయంగానే వుంటున్నారు. ఇలా భయటకు వచ్చి జాఫర్ ప్రాణాలు కోల్పోయాడు.